జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Update: 2020-09-03 06:54 GMT

Supreme Court: జగన్ సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌పీ, స్టేపై ప్రతివాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ సర్కారు తీసుకొచ్చిన 81, 85 జీవోలను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియంలో బోధననే కోరుతున్నారని ఏపీ సర్కారు వాదించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. కేవియట్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News