బొడ్డూడని పసికందుకు వాతలు

Update: 2019-02-06 02:44 GMT

టెక్నాలజీ యుగంలో కూడా మూఢవిశ్వాసాల్ని వీడటం లేదు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంత ప్రజల్లో కొందరి తీరు ఇందుకు అద్దం పడుతోంది. పసికందు లకు ఎలాంటి రోగాలు వచ్చినా శరీరంపై వాతలు పెట్టె పోకడ ఇంకా పోలేదు. ఈ దురాచారానికి ఓ పసికందు ప్రాణాలతో పోరాడుతోంది. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఊబగుడ్డి గ్రామానికి చెందిన పాడి నర్శమ్మ ఇటీవల వసతిగృహంలో ప్రసవించింది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండటంతో స్వగ్రామానికి పంపించారు డాక్టర్లు. అయితే ఎటువంటి రోగాలు ధరిచేరనీయకుండా ఉండాలంటే బొడ్డూడని శిశువుకు వాతలు పెట్టాలని కొందరు సూచించారు.

దాంతో శిశువు పుట్టిన ఐదో రోజునే కడుపు, చేతులపైన కుటుంబ సభ్యులు సూది కాల్చి వాతలు పెట్టారు. దీంతో ఆ శిశువు తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. పైగా సూది కాల్చి పెట్టిన వాతలు రెండురోజుల తర్వాత కూడా తగ్గకపోవడంతో మంగళవారం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు శిశువు పట్ల చేసిన నిర్వాకానికి హతాశులయ్యారు వైద్యులు. వెంటనే శిశువుకు చికిత్స చేయడం ప్రారంభించారు. మంగళవారానికి శిశువు వయసు 11 రోజులకు చేరినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఊబగుడ్డిలో పిల్లలు పుడితే వాతలు పెట్టడం ఆచారమని, అందుకే తామూ ఇలా చేశామని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

Similar News