కొత్త పరకామణి భవనంలో అత్యాధునిక సదుపాయాలు.. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, అత్యాధునిక నగదు లెక్కింపు యంత్రాలు
Tirumala: నోట్ల దమ్మును అరికట్టే యంత్రాలు.. బంగారు, వెండి కానుకలు భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్‌లు
కొత్త పరకామణి భవనంలో అత్యాధునిక సదుపాయాలు.. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, అత్యాధునిక నగదు లెక్కింపు యంత్రాలు
Tirumala: లోకాలను ఏలే బ్రహ్మాండనాయకుడు, సిరిని పాదాక్రాంతం చేసుకున్న శ్రీనివాసుడు, ఇల వైకుంఠంలో వెలసిన వెంకటేశ్వరుడు.. ఆ ఏడుకొండలవాడు. అడుగడుగు దండాల వాడే కాదు.. వడ్డీ కాసుల వాడు కూడా. కానుకలు ఇచ్చే భక్తుల కోరికలు నెరవేర్చే.. ఆపదమొక్కుల వాడు. అందుకే శ్రీవారికి నిత్యం కోట్లాది సంపదను సమర్పించుకుంటారు.. భక్తులు. మరి ఆ సంపదను లెక్కించడం.. అంత సులువు కాదు. అందుకు పరకామణి వ్యవస్థ పనిచేస్తుంది. కొన్ని దశాబ్దాలుగా ఆలయంలోపల ఉన్న ఈ వ్యవస్థను.. తొలిసారిగా ఆలయం వెలుపల నూతనంగా నిర్మించిన భవనంలోకి తీసుకొస్తోంది.. టీటీడీ. ఆ విశేషాలు మీ కోసం..
కలియుగాంతం వరకు తన భక్తులు సమర్పించే కానుకలతో వడ్డీ కడతానని.. కుబేరుడికి శ్రీవారు మాటిచ్చినట్లు.. పురాణాలు చెబుతున్నాయి. అందుకే.. తిరుమలకు వచ్చే భక్తులు.. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదంతో పాటు.. కానుకలు సమర్పిస్తేనే.. యాత్ర పరిపూర్ణమవుతుందని విశ్వసిస్తారు. అలా నిత్యం హుండీ ద్వారా.. 3 నుంచి 5 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. అలా వచ్చిన ఆదాయాన్ని పరకామణి భవనంలో లెక్కిస్తారు. తిరుమల చరిత్రలో 1965 వరకు బంగారు వాకిలి వద్దనే.. శ్రీవారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తూ వచ్చారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారము వద్దకు మార్చారు. అయినా.. హుండీ లెక్కింపులో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే కాయిన్ల లెక్కింపును తిరుపతికి మళ్లించారు. రోజూ ప్రత్యేక వాహనంలో తిరుపతి పరిపాలనా భవనానికి చిల్లర నాణేలను తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆదాయం.. 15 గంగాళాలు సరిపడా వస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న పరకామణి భవనం స్థలం సరిపోకపోవడంతో.. తాజాగా సరికొత్త పరకామణి భవనాన్ని నిర్మించారు.
గత కొన్నేళ్లుగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో.. అదే రీతిలో హుండీ ఆదాయం పెద్ద ఎత్తున సమకూరుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న పరకామణిలో కానుకలు లెక్కింపు ఆలస్యం అవుతుండడంతో.. పరకామణిని బయటకు తరలించాలని టీటీడీ నిర్ణయించింది. బెంగళూరుకు చెందిన దాత.. మురళీకృష్ణ సహాయంతో 23 కోట్లతో.. 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ఎదురుగా రెండస్తుల్లో కొత్త పరకామణి భవనాన్ని నిర్మించారు. దీన్ని బ్రహ్మోత్సవాల సమయంలో.. సీఎం జగన్ ప్రారంభించారు. అత్యంత ఆధునికంగా పటిష్ట భద్రత ఏర్పాట్లతో.. ఈ భవనాన్ని నిర్మించారు. కానుకలు లెక్కించే సమయంలో భక్తులు చూసే విధంగా.. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమర్చారు. అంతేకాదు.. అత్యాధునిక నగదు లెక్కింపు యంత్రాలను కూడా వినియోగించనున్నారు. నోట్ల ద్వారా వచ్చే దుమ్మను అరికట్టే యంత్రాలు, బంగారు, వెండి కానుకలను భద్రపర్చే స్ట్రాంగ్ రూమ్‌లు.. ఇలా అన్ని రకాలుగా అత్యాధునికంగా భవనాన్ని తీర్చిదిద్దారు.
మరోవైపు పరకామణి సేవలో.. టీటీడీ ఉద్యోగులతో పాటు.. ఆసక్తి ఉన్న భక్తులకు కూడా టీటీడీ అవకాశం కల్పిస్తుంది. ఆలయం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ.. 200 మందికి పైగా రెండు షిఫ్టుల్లో.. 14 గంటల పాటు నిరంతరాయంగా హుండీ లెక్కింపులో పాల్గొంటారు. ఇలా హుండీ లెక్కింపులో పాల్గొనడం తమ అదృష్టంగా భక్తులు భావిస్తున్నారు.
త్వరలోనే ఈ భవనం అందుబాటులోకి వస్తుండటంతో.. ఇక పై నోట్లతో పాటు.. కాయిన్లను కూడా తిరుమలలో లెక్కించనున్నారు.