డీజిల్ రాయితీ దూరం.. వేట భారం!

Srikakulam: ప్రతి ఏడాది పెరిగిపోతున్న వేట ఖర్చు, కొత్త కార్డుల కోసం మత్స్యకారుల ఎదురుచూపులు

Update: 2022-06-12 06:32 GMT

డీజిల్ రాయితీ దూరం.. వేట భారం!

Srikakulam: సిక్కొలు జిల్లాలో మత్స్యకారుల వేట నిషేధం మరో మూడు రోజుల్లో ముగుస్తుంది. దీంతో తమ బోట్లను మరమ్మతులు, వలలను సిద్దం చేసుకుంటున్నారు. మరోవైపు గంగపుత్రులకు డీజిల్ రాయితీ కార్డులను అందజేస్తామంటుంది ప్రభుత్వం.. కానీ నేటి వరకూ కార్డులు అందలేదంటున్నారు మత్స్యకారులు. 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతమున్న శ్రీకాకుళం జిల్లాలో 34 వేల మంది వేటకు సిద్దమవుతున్నారు. అలాగే వలసలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మర పడవలకు డీజిల్ కొనడానికి రాయితీ కార్డులు రాకపోవడంతో ఢీలా పడుతున్నారు. ఈ కార్డు ఉంటేనే డీజిల్.. లేకపోతే ఇవ్వరు. అయినా నేటి వరకూ ఆ కార్డులు రాలేదు. జిల్లాలో అధికారికంగా ఇంజన్ బోట్లు 1600 ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 3 వేలు పై చిలుకు ఇంజన్ బోట్లు ఉన్నాయని తెలుస్తుంది. అలాగే 2 లక్షల మంది మత్స్యకారులు జిల్లాలో ఉన్నారు.

సముద్రంలో మర పడవలపై వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పటి నుంచో డీజిల్‌పై రాయితీ ఇస్తోంది. ఇందుకుగాను స్మార్ట్‌ కార్డులను మంజూరు చేస్తారు. కానీ నేటి వరకూ ఒక్కరికి కూడా డీజిల్ రాయితీ స్మార్ట్ కార్డులు అందలేదని మత్స్యకారులు చెబుతున్నారు. 120 రూపాయలు చెల్లించి మర పడవ రిజిస్ట్రేషన్‌ కాపీ, ఆధార్‌ కార్డు, ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్ ఫోన్ తీసుకువెళ్తే వివరాలు నమోదు చేస్తారు. అక్కడి నుంచి మిగిలిన ప్రక్రియ నడుస్తుంది. విలేజ్‌ ఫిషరీస్ సహాయకులు, FDO, AD, DDల లాగిన్లకు వెళ్లిన తరువాత దరఖాస్తు రాష్ట్రసాయిలో కమిషనర్‌ వరకూ చేరుతుంది. అక్కడి నుంచి స్మార్ట్‌కార్డు తయారు చేసే ఏజెన్సీకి చేరుతుంది. వెంటనే సంబంధిత మత్స్యకారుని పేరు మీద స్మార్ట్‌ కార్డు జారీ అవుతుంది. కాని ఇంతవరకు అలా జరగలేదు.

జిల్లాలో ఒకప్పుడు రణస్థలం, శ్రీకాకుళం, టెక్కలిలో మూడు చోట్ల మాత్రమే ఆథరైజేషన్‌ అధికారులు ఉండేవారు. పరిపాలనా సౌలభ్యానికి ఆ సంఖ్యను తాజాగా ఆరుకు పెంచారు. ప్రస్తుతం రణస్థలం, టెక్కలి, ఎచ్చెర్ల, కళింగపట్నం, కాశీబుగ్గ, సోంపేట ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. పాత కేంద్రాలతో పాటు కొత్తవి మారిన ప్రాంతాల్లోనూ స్మార్ట్‌కార్డులకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. పాతకార్డులు ఉన్నా పనిచేయవు. గతంలో సరఫరా చేసిన మ్యాగ్నటిక్‌ చిప్‌ కార్డులతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అవి మ్యాగ్నటిక్‌తో ఉండడంతో జేబులో పెట్టినా, ఏ ఇతర అయస్కాంత శక్తి ఉన్నచోట ఉంచినా పనిచేయకుండా పోతోంది. దీంతో డీజిల్‌ వేసే సమయంలో ఉపయోగపడటం లేదు. ఒక మరపడవకు 300 లీటర్ల వరకు డీజిల్‌ రాయితీ ఇస్తారు. లీటరుపై 9 రూపాయలు రాయితీ అంటే నెలకు 2వేల 700 రూపాయల వరకు కేటాయిస్తారు. జిల్లాలోని ప్రస్తుతం నమోదై ఉన్న మర పడవలన్నింటికీ ఇది వర్తిస్తుంది.

ఇదిలా ఉంటే మత్స్యకార భరోసా ఇంకా రాని వారు అనేక మంది ఉన్నారు. మత్స్యకార భరోసాకు సంబంధించి 4 కోట్ల నిధులు వరకూ ఇంకా ఆ శాఖలోనే ఉంది. కనీసం అర్హత ఉన్నవారికి వాటిని బదిలీ చేయకుండా అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్ధం కావడంలేదంటున్నారు.

Tags:    

Similar News