బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై ఏపీ స్పీకర్ సమీక్ష

Update: 2019-07-09 12:34 GMT

బడ్జెట్‌ సమావేశాలు ప్రశాంతంగా సజావుగా అర్ధవంతంగా జరిగేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఏపీ స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఏపీ బడ్జెట్‌ సెషన్స్ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులు ఎలా వ్యవహరించాలో భద్రతాపరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో దిశానిర్దేశం చేశారు.

బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, వివిధ శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన స్పీకర్‌ అసెంబ్లీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అధికారులు ఎలా వ్యవహరించాలి? భద్రతాపరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? అనే దానిపై దిశానిర్దేశం చేశారు. అలాగే సభలో సభ్యులడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు సమర్పించాలని, అదేవిధంగా బిల్లులు సిద్ధం చేయడంలో కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పీకర్ సూచించారు. ఇక అసెంబ్లీ ప్రాంగణంలో కమాండ్‌ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న స్పీకర్‌ భద్రతా కారణాల దృష్ట్యా సందర్శకుల సంఖ్యను ఐదు వందలకు మించకుండా చూడాలన్నారు.

బడ్జెట్‌ సమావేశాలు ప్రశాంతంగా సజావుగా అర్ధవంతంగా జరిగేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. సభ్యులడిగే ప్రశ్నలకు బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోపే సమాధానాలు పంపాలని ఆయా శాఖల కార్యదర్శులను కోరారు. అలాగే వివిధ శాఖల వార్షిక నివేదికలను సకాలంలో సభకు సమర్పించాలని సూచించారు. బిల్లుల్ని ఆదరాబాదరాగా చివరి నిమిషంలో సభకు పంపకుండా ముందే సిద్ధంచేయాలని కార్యదర్శులను కోరారు. ఇక సభలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశమిచ్చేందుకు తాను ప్రయత్నిస్తానన్నారు స్పీకర్‌.

స్పీకర్ దిశానిర్దేశంతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం చర్యలు చేపట్టారు. సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖల కార్యదర్శులు సకాలంలో సమాధానాలు పంపాలని ఆదేశించారు. అలాగే పది నుంచి పన్నెండు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశమున్నందున సంబంధిత కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇక అన్ని శాఖల బిల్లులు, ప్రశ్నలకు సమాధానాలను పర్యవేక్షించాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి సిసోడియాను సీఎస్‌ ఆదేశించారు.

Tags:    

Similar News