Visakha Railway Station: వైజాగ్ రైల్వే స్టేషన్‌లో మరిన్ని ఆంక్షలు
Visakha Railway Station: ఏపీలో ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.
Visakha Railway Station:(File Image)
Visakha Railway Station: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో విశాఖ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్‌లో మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు స్టేషన్‌లోకి వచ్చిపోయే ప్రయాణికులను ఒకే దారి నుంచి అనుమతిస్తుండగా, ఇక నుంచి రెండు వేర్వేరు మార్గాల ద్వారా అనుమతించనున్నారు.
స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులను జ్ఞానాపురం గేట్ వద్దనున్న 8వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి స్టేషన్‌లోకి అనుమతిస్తామని, బయటకు వెళ్లేవారు ఒకటో నంబరు ప్లాట్ ఫాం నుంచి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు తొలుత థర్మల్ స్క్రీనింగ్ చేస్తామన్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తరచూ శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్‌షీట్లు సరఫరా చేయబోమని, ఎవరికి వారే వాటిని తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, స్టేషన్‌లో ఎవరూ గుంపులుగా ఉండొద్దని, ఆహారం కూడా ఎవరికివారే తెచ్చుకోవాలని కోరారు.