స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఇతర విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని.. సమాజసేవకులుగా దేశానికి సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష పేర్కొన్నారు.
కడప: స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఇతర విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని.. సమాజసేవకులుగా దేశానికి సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో శంకరాపురంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కేంద్రంలో జాతీయ యువజన వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో సంఘం జిల్లా కార్యదర్శి సాజిద్ పర్యవేక్షణలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషకు విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి వెలిగించిన ఆయన స్కౌట్స్ అండ్ గైడ్స్ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశభక్తి, క్రమశిక్షణకు చిరునామాగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటారని.. చిన్నతనం నుండి శిక్షణ పొందడం ద్వారా మంచి పౌరులుగా ఎదగవచ్చున్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జిల్లాకే గర్వకారణమన్నారు.
ఈనెల 13 వరకు శిక్షణ శిబిరం జరుగుతుందని సౌత్ ఈస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆలమేంద్ర శర్మ తెలిపారు. దేశంలోని మొత్తం 53 స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు పాల్గొన్నాయన్నారు. ఈ ఐదు రోజులు విద్యార్థులకు కవాతు, యోగ, స్వచ్ఛభారత్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రథమ చికిత్స చేయడం, వంతెన దాటడం వంటి వాటిలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రామ్మోహన్ రావు, పెద్దిరెడ్డి, లక్ష్మి కర, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.