Sachivalayam Exams 2020: అభ్యర్థుల సమీపాల్లోనే పరీక్షా కేంద్రాలు.. 7 రోజుల పాటు సచివాలయ పరీక్షలు

Sachivalayam Exams 2020 | కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు దూరంగా వెళ్లకుండా సమీపాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Update: 2020-09-06 02:39 GMT

Sachivalayam Exams 2020 | కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు దూరంగా వెళ్లకుండా సమీపాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అనుగుణంగా ఈ నెలలో 21 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.దీంతో పాటు ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కోవిద్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 30 కి.మీ. దూరం మించకుండా పరీక్ష కేంద్రాలను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మహిళా అభ్యర్థులతో పాటు మొత్తం 4.57 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్న కేటగిరి–1 ఉద్యోగాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని అధికారులు రాత పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కేవలం 680 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో జిల్లాకొక కేంద్రంలోనే ఆ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాతపరీక్ష కేంద్రాల ఎంపిక ఇప్పటికే దాదాపు పూర్తయినట్టు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈనెల 20 – 26వ తేదీల మధ్య ఏడు రోజుల పాటు రెండు పూటలా 14 రకాల రాతపరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

► మొత్తం 16,208 ఉద్యోగాలకు 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి రోజు ఉదయం కేటగిరి –1 పోస్టులకు 2,228 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4.57 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తొలిరోజు మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.24 లక్షల మంది 1,067 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు.

► రెండో రోజు నుంచి ఒక్కొక్క రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మేరకు గరిష్టంగా 516, కనిష్టంగా 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

► అభ్యర్థులు రవాణా ఇబ్బందులు పడకుండా రాత పరీక్షల సమయంలో అన్ని ప్రాంతాలకు బస్సులు నడపాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు.

► కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి పరీక్ష కేంద్రంలోనూ కనీసం ఒక గదిని ఐసోలేషన్‌ కోసం కేటాయించి, అక్కడ ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను కూడా అందుబాటులో ఉంచుతారు.

► రాతపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సి ఉందని, ఈ మేరకు హాల్‌టికెట్‌లో కూడా స్పష్టమైన సూచన చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News