క్వాంటం వ్యాలీలో భవనాల నిర్మాణానికి రూ.103 కోట్లు

రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 103.96 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

Update: 2025-12-22 12:54 GMT

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 103.96 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

క్వాంటం కంప్యూటింగ్ ఎక్విప్ మెంట్ అమరావతికి చేరుకోనున్న దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన రెండు భవనాలను 43 వేల చదరపు అడుగుల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. భవనాల నిర్మాణానికి టెండర్ పిలిచి ఎల్1 కూడా చేయడం జరిగిందన్నారు. సీఆర్డీఏ అథారిటీ భవనాల నిర్మాణాలను వెంటనే ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.

అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాల ఇంటీరియర్ పనుల కోసం రూ. 109 కోట్లు విడుదల చేశామన్నారు. నాబార్డ్ మంజూరు చేసిన రూ. 7,500 కోట్లలో రూ. 1,502 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు. వాటిలో రూ.100 కోట్లు ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుకు పర్మిషన్ ఇచ్చినట్లు చెప్పారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యూనివర్సిటీ ఏర్పాటు నిమిత్తం 23.127 ఎకరాలు శాఖమూరు గ్రామ పరిధిలో కేటాయించామన్నారు. యూనివర్సిటీకి 60 సంవత్సరాలు ఒక రూపాయి లీజుతో ఇవ్వడం జరిగిందన్నారు. యూనివర్సిటీ నిర్మాణానికి ఆయుష్ సంస్థ రూ.750 కోట్లకు పైగా వ్యయం చేయనుందన్నారు.

సదరన్ గ్లోబల్ హోటళ్ల వారికి గతంలో కేటాయించిన 2 ఎకరాలు, ఓం సాయి అసోసియేషన్ కు 4 ఎకరాలు కేటాయింపులు జరిగినా, అక్కడ భూ సమస్యలు తలెత్తడంతో వారికి ఇతర ప్రాంతంలో భూమి కేటాయింపులు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అమరావతిని వరద ముంపు నుండి కాపాడటానికి నెదర్లాండ్స్ తో డిజైన్స్ రూపొందించడం జరిగిందని, కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ లతో పాటు 6 రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగిందన్నారు. ఇవి కాకుండా అధికంగా వచ్చే వరద ముప్పు నుండి రక్షణగా మరో 22,500 క్యూసెక్క్ ల నీటిని బటయకు తరలించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 

Tags:    

Similar News