పూర్తిగా ధ్వంసమైన స్థితిలో రాయల్ విశిష్ట బోటు

Update: 2019-10-22 09:40 GMT

కచ్చులూరు దగ్గర నీటమునిగిన రాయల్ వశిష్ట బోటు ఎట్టకేలకు అధ్వాన్న స్థితిలో బయటకొచ్చింది. 38 రోజుల ప్రయత్నాల తర్వాత ముక్కలు ముక్కలుగా మాత్రమే బోటును వెలికి తీయగలిగారు. రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు దాదాపు 15 రోజులుగా ధర్మాడి సత్యం టీమ్ తీవ్రంగా శ్రమించింది. చాలా సార్లు ప్రతికూల వాతావరణం మరోసారి లంగర్లు తెగిపోవడం ఒక్కోసారి వరద పోటు భారీ వర్షం ఇలా ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ ధర్మాడి సత్యం బృందం తమ ప్రయత్నాలను కొనసాగించింది.

బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం టీమ్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ సహాయం కోరారు. ఆయన ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులను ముమ్మరం చేశారు. కాకినాడ నుంచి డీప్ వాటర్ డైవర్స్ రంగంలోకి దిగి బోటు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి నేరుగా బోటుకే లంగరు వేశారు. తాళ్లతో, ఇనుప తీగలతో కొక్కేలతో బోటుకు హుక్కులు తగిలించినా బోటు రెయిలింగ్ ఒకసారి మరోసారి డ్రైవర్ కేబిన్ మాత్రమే బయటకు లాగగలిగారు. చివరకు ఇవాళ బోటుకు అడుగు భాగంలో రోప్ లను,లంగర్లను బిగించడం ద్వారా ఆపరేషన్ సక్సెస్ అయింది.

బోటును మొత్తంగా లంగరు ద్వారా గుర్తించి బయటకు లాగగలిగారు. బోటును ఒడ్డుకు చేర్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నెల్లాళ్లుగా 100 అడుగులలోతుకు జారిపోయిన బోటు పూర్తిగా ధ్వంసమైంది గుర్తు పట్టడానికి వీల్లేని స్థితిలో శకలాలు శకలాలుగా బయటకొచ్చింది. సెప్టెంబర్ 15న ఈ బోటు నీట మునగగా దాదాపు నెల్లాళ్ల పదిరోజుల తర్వాత బయటకు తీయగలిగారు. ఈ ప్రమాద సమయంలో బోటులో 77మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 39 మంది మరణించగా,మరో 12 మంది గల్లంతయ్యారు. 

Tags:    

Similar News