Reduced Water Inflow to Rivers: ఏపీకి తప్పిన వరద ముప్పు.. నదులకు తగ్గిన ఇన్ ఫ్లో

Reduced Water Inflow to Rivers: మూడు రోజులుగా వర్షాలు తగ్గముఖం పట్టడంతో దాని ప్రభావం నదుల ఇన్ ఫ్లో లపై పడుతోంది.

Update: 2020-08-25 02:15 GMT

Reduced Water Inflow to Rivers: మూడు రోజులుగా వర్షాలు తగ్గముఖం పట్టడంతో దాని ప్రభావం నదుల ఇన్ ఫ్లో లపై పడుతోంది. క్రమేపీ వీటిని ఎగువ నుంచి వచ్చే నీరు సైతం తగ్గడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతకంతకూ ఇన్ ఫ్లో తగ్గడంతో సముద్రంలోకి వదిలే నీటిని తగ్గిస్తున్నారు. దీంతో పాటు ఏపీలోని రెండు నదుల్లోనూ ఇంతవరకు ఎగురవేసిన ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.

పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుముఖం పడుతోంది. సోమవారం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 1.81 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలను సముద్రంలోకి వదులుతుంటే.. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 13.20 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలను కడలిలోకి వదులుతున్నారు.

► ఆల్మట్టి నుంచి లక్ష క్యూసెక్కులు, నారాయణపూర్‌ నుంచి 68 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు.

► శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న వరద 2.65 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

► నాగార్జున సాగర్‌ నుంచి దిగువకు 89 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏడాది గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ప్రకాశం బ్యారేజీలోకి 2.26 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు వదలగా మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 39.50 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 13.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. పది వేల క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 13.20 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14 అడుగుల్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. మంగళవారం నాటికి వరద మరింతగా తగ్గే అవకాశం ఉంది.   

Tags:    

Similar News