నల్లమల అటవీ ప్రాంతంలో పులులకు రక్షణ లేదా...?

*అటవీ ప్రాంతంలో పులులు ఎందుకు మృత్యువాత పడుతున్నాయి...?

Update: 2022-05-11 03:00 GMT

నల్లమల అటవీ ప్రాంతంలో పులులకు రక్షణ లేదా...? 

Nallamala Forest: పెద్దపులి ఈ మాట వినగానే ఓ గంభీర్యమైన జంతువు కళ్ల ముందు మెదులుతుంది. అలాంటి అరుదైన వన్యప్రాణి సంరక్షణ ఇప్పుడు ఓ ప్రశ్ననార్థకంగా మారింది. నంద్యాల జిల్లాలో అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన పెద్ద పులి ఘటన అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వైఖరికి అద్దం పడుతోంది. పోతిరెడ్డిపాడు మూడవ గేట్ పైన సంచరించినట్టు అధికారులు గుర్తించిన ఓ పెద్ద పులి 24 గంటలు గడవక ముందే నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ లో విగత జీవిగా అధికారులకు కనిపించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించిన ఈ పెద్ద పులి మృతి ఓ సవాల్ గా మారింది. పెద్ద పులి సహజంగా మృతి చెందిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.

నల్లమల అటవీ ప్రాంతంలో ఓ పెద్ద పులి మృతి చెందిన సమాచారం అందుకున్న అధికారులు బైర్లుటి రేంజ్ , పెద్ద అనంతపురం సెక్షన్ లో గాలింపు మొదలు పెట్టారు. జాగిలాలతో అన్వేషణ సాగించారు. దీంతో పెద్ద పులి మృతి చెందిన ప్రాంతం అధికారులు గుర్తించి అక్కడకు చేరుకున్నారు. ఇప్పటికే ఓ చిరుత మృతి ఘటన అధికారులను ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో మరో పెద్ద పులి మృతి చెందటం వారిని మరింతగా కలవర పెడుతోంది. ఈ పెద్ద పులి మృతి వెలుగులోకి రాకుండా అధికారులు విఫల యత్నం చేశారు.

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి ఘటనపై స్పందించటానికి అధికారులు నిరాకరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వరుసగా పులులు మృత్యువాత పడటం అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందుకు కారణం ఏమిటో చెప్పలేని పరిస్థితిలో అధికారులు వున్నారు. పులులు చని పోవటం వల్ల ఎక్కడ తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందో అనే భయం వారికి పెరిగింది. అసలు నల్లమల అటవీ ప్రాంతంలో ఏం జరుగుతుంది. పులులు ఎందుకు చనిపోతున్నాయి. దీనిపై అధికారులు ఎందుకు నోరు మెదపటం లేదు అన్నదే జంతు ప్రేమికుల ప్రశ్న దీనికి సమాధానం మాత్రం ఇప్పుడు మౌనమే అవుతోంది.

Tags:    

Similar News