తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన...విశాఖలో ప్రధాని మోడీ..!
* ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో సభ
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన...విశాఖలో ప్రధాని మోడీ
Prime Minister: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తూ, కొత్తగా తలపెట్టనున్న ప్రగతి పనులకు శంకుస్థాపన, శిలాఫలకాల ఆవిష్కరణ చేయనున్నారు.
రాత్రి విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ సర్కారు ఘనంగా స్వాగతించింది. విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ఘనంస్వాగతం పలికారు. బీజేపీ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేస్తూ కంచర్లపాలెం, ఓల్డ్ ఐటీవో మధ్య రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోడీ రాకతో విశాఖ రోడ్లు కొత్త అందాలను సంతరించుకున్నాయి. రోడ్డు మార్గాలు, విద్యుత్తు స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటుతో విశాఖ రోడ్లు నవ్యశోభతో అలరారాయి. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో విశాఖ రోడ్లను ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు.
భారీ బందోబస్తు నడుమ ఈస్టర్న్ నావల్ కమాండ్ అతిథిగృహంలో బసచేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లోనూ, ముఖ్యమంత్రి జగన్ పోర్టు గెస్ట్‌హౌస్‌లోనూ బసచేశారు. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు స్టార్ హోటళ్లలో బసవసతి కల్పించారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా ఆర్మ్‌డ్ రిజర్వుపోలీసులు, బాంబు డిస్పోజల్ బృందాలు, కేంద్ర బలగాలతో సహా 6700 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖను పోలీసుల బలగాలు దిగ్బంధించాయి. నగరంలోకి వచ్చే ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీచేసి అనుమతించారు.
విశాఖ పర్యటనలో మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ ఉదయం ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొంటారు. సభా వేదిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోడీ సభను తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ప్రధాని మోడీ సభకు వచ్చే జనం ఇబ్బంది పడకుండా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక్కడి సభావేదికపైనుంచే వర్చువల్‌గా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.
దశలవారీగా తలపెట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన, శిలాఫలకాల ఆవిష్కరణ చేస్తారు. ONGC యూ ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. 6 లేన్ గ్రీన్ ఫీల్డ్ రాయ్ పూర్- విశాఖ ఎకనామిక్ కారిడార్ కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుడతారు. శ్రీకాకుళం అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఈస్ట్‌కోస్ట్ జోన్ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత వడ్లపూడిలో 260 కోట్లతో చేపట్టిన వ్యాగన్ వర్క్‌షాప్, హిందుస్థాన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ప్లాంట్ ఆధునికీకరణతో విస్తరణ పనులు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ కామర్స్ పరిపాలనా భవనానికి శంకుస్థాపన చేస్తారు. చేపల రేవు ఆధునికీకరణ, కాన్వెంట్ కూడలినుంచి షీలానగర్ పోర్టు రహదారికి శంకుస్థాపన, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు సీఎం జగన్ హాజరు కానున్నారు.