కాసేపట్లో నేలమట్టం కానున్న ప్రజావేదిక .. నిర్విరామంగా కొనసాగుతున్న కూల్చివేత పనులు

Update: 2019-06-26 01:29 GMT

ఉండవల్లిలోని ప్రజావేదిక కాసేపట్లో పూర్తిగా కూలిపోనుంది. నిర్విరామంగా కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. జేసీబీలు, భారీ యంత్రాలతో ప్రజావేదిక కూల్చివేస్తున్నారు. గోడలు మొత్తం పగులగొట్టారు. కూల్చివేతకు ముందు అక్కడ ఉన్న ఫర్నీచర్, ఇతర సామాగ్రిని తరలించారు.

అక్రమ కట్టాలను కూల్చివేస్తామంటూ సీఎం జగన్ ప్రకటించిన 24గంటల్లోనే సీఆర్డీఏ అధికారులు ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. భారీ యంత్రాలతోపాటు వంద మందికి పైగా కూలీలతో గోడలను నేలమట్టం చేశారు. ప్రజావేదిక ప్రహరీ గోడను జేసీబీతో కూల్చివేశారు. అల్యూమినియం ఫ్రేమ్ లు, అద్దాలు, తలుపులు, కిటికీలను తిరిగి వినియోగించుకునే జాగ్రత్తగా తొలగించారు. అలాగే ఎప్పటికప్పుడు శిథిలాలను లారీలతో తరలిస్తున్నారు.

ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజావేదిక పరిసరాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. ప్రజావేదికతోపాటు కరకట్టను ఆధీనంలోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలను, సమీప గ్రామాల ప్రజలను అటువైపు రాకుండా నిషేధం విధించారు. మీడియాను సైతం ప్రజావేదిక సమీపానికి అనుమతించలేదు.  

Tags:    

Similar News