పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టడమే గుర్తింపు

అమరజీవి పొట్టి శ్రీరాములుకి సరైన గుర్తింపు పోలవరం ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టడమేనని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ‘జనసేన పదవి- బాధ్యత సమావేశం’లో ఆయన మాట్లాడారు.

Update: 2025-12-22 13:53 GMT

మంగళగిరి: అమరజీవి పొట్టి శ్రీరాములుకి సరైన గుర్తింపు పోలవరం ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టడమేనని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ‘జనసేన పదవి- బాధ్యత సమావేశం’లో ఆయన మాట్లాడారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయని తెలిపారు. మరికొంతమందిని త్వరలో నామినేట్ చేస్తామన్నారు. మొదట నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన వారికి, పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చినట్లు తెలిపారు. ఎటువంటి సిఫార్సు లేకుండా పదవులు ఇచ్చామని చెప్పారు. పదవి అనేది చిన్నదా? పెద్దదా? అని కాకుండా వచ్చిన పదవిని ప్రజలకు సేవ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి లభించే గొప్ప అవకాశంగా భావించాలన్నారు.

‘‘రాజ్యాంగ పరిధిలోనే పోరాటం చేస్తాం. చివరి దశలో మాత్రమే గొడవ పెట్టుకుంటాం. ఆ గొడవ చాలా తీవ్రంగా ఉంటుంది. చొక్కా మడిచి ముందుకు వెళతాం. దాన్ని ఆఖరి అస్త్రం. సయోధ్యగా మీరు ఎంత మాట్లాడతారో అప్పటివరకు నేను శాంతంగా ఉంటాను. మీరు కూడా చర్చ చేయండి. వాదించండి. ఆమోదయోగ్యమైన భాషలో మాట్లాడండి. సామాన్యుడు హర్షించేలా మాట్లాడండి.’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

‘‘కేబినెట్ లో కూడా పర్యాటకం మీద మాట్లాడుతున్నపుడు ఎకో టూరిజం అనేది అటవీశాఖలోకి వస్తుంది కాబట్టి ఓ కమిటీ వేశారు. దానికి ఛైర్మన్ గా బాధ్యత అప్పగించారు. ప్రాథమికంగా పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయాలంటే శాంతిభద్రతలు ప్రధానం. మోటర్ రైడ్ చేసే మహిళా వ్లాగర్ ఢిల్లీ నుంచి వచ్చి శ్రీశైలం వెళ్తే గదులు ఇవ్వలేదు. ఒంటరి ఆడపిల్లలకు ఇవ్వం అని చెప్పారు. అది పాలసీ అని చెప్పారు. అది నా దృష్టికి వచ్చింది. అయితే, తర్వాత వారిని గౌరవించి దర్శనం చేయించి పంపాను. అతిథులను గౌరవించి పంపాలి. పర్యాటకంలో కొన్ని మార్పులు రావాలి. ముఖ్యంగా సేఫ్టీ టూరిజం పాలసీ రావాలి అని బలంగా చెప్పాను.’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

‘‘సింగపూర్ తరహా అభివృద్ధి రావాలంటే సింగపూర్ తరహా పాలన రావాలి. సింగపూర్ అభివృద్ధి ప్రదాత, మాజీ ప్రధాని వాంగ్ యూ సొంత మనుషుల్ని కూడా తప్పు చేస్తే వదల్లేదు. అంత బలంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే టూరిజం కూడా దెబ్బతింటుంది. మాజీ ముఖ్యమంత్రి వచ్చి పోలీసు అధికారుల్ని తిడుతూ, మేం వస్తే కాంట్రాక్టర్లను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తుంటే చాలా తప్పుడు సంకేతం వెళ్తుంది. పర్యాటకం మీదనే కాదు... పెట్టుబడులు, అభివృద్ధి అన్ని విషయాల్లోనూ అది రాంగ్ సిగ్నల్ అవుతుంది.’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

Tags:    

Similar News