తిరుమల క్షేత్రంలో సంక్రాంతి పండుగ తర్వాత పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఒకసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ సంచులను కొండపైన నిషేధిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా తిరుమల కొండపైన విస్తృతంగా భక్తులకు ఉచిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో 10 సంవత్సరాలలో తొలిసారిగా తిరుమలలోని డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండాయన్నారు. తిరుమలకు శాశ్వతంగా నీటి అవసరాలు తీర్చేందుకు 400 కోట్లతో బాలాజీ రిజర్వాయర్‌ను టీటీడీ నిర్మిస్తోందన్నారు.