అనంతలో రాజకీయ వైరానికి దారి తీస్తున్న ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు

Anantapur: ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అనంతలో రాజకీయ వైరానికి దారి తీస్తోంది.

Update: 2021-08-24 11:15 GMT

అనంతలో రాజకీయ వైరానికి దారి తీస్తున్న ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు

Anantapur: ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అనంతలో రాజకీయ వైరానికి దారి తీస్తోంది. మూడేళ్ల తరువాత కోర్టు ఆదేశాలతో నిధులు మంజూరైనా... చెల్లింపుల విషయంలో జాప్యం జరుగుతుంది. 2018-19 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అనంతపురంలో చేసిన పనుల బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది.

బిల్లులు చెల్లించే టైమ్‌లో ఎన్నికలు వచ్చి వైసీపీ అధికారంలోకి రావడంతో బిల్లులు నిలిచిపోయాయని గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించడంతో వెంటనే బిల్లులు చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ చెల్లించలేదని చెబుతున్నారు. రెండేళ్లైనా తమ బిల్లులు చెల్లించకపోవడంతో... ఇప్పటికే అప్పులపాలయ్యామని, వెంటనే అధికారులు స్పందించి తమ బిల్లులు మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు.

కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం అందుకు సంబంధించిన మొత్తాన్ని గ్రామ కార్యదర్శి, ఎంపీడీవోల ఖాతాల్లో జమ చేశారు. అయితే అక్కడే అసలు రాజకీయ వివాదం మొదలైంది. సర్పంచులు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో పలు నియోజకవర్గాల్లో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. అంతేకాక కొన్నిచోట్ల తమకు వాటా కావాలని నేతలు పేచీ పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక రాప్తాడు, ధర్మవరం వంటి నియోజకవర్గాల్లో అధికారులపై నేతల ఒత్తిడి మరింత ఎక్కువగా ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

పనులు చేసి రెండేళ్లుగా బిల్లుల కోసం గుత్తేదార్లు నిరీక్షిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల రాజకీయంతో తాము అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వెంటనే తమకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News