రాజకీయాల్లో మార్పు రావాలంటే ఓపిక, సహనం అవసరం: పవన్

దేశ రక్షణ కోసం అహర్నిశలు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్న సైనికుల కుటుంబాలను ఆదుకొని అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గారు అన్నారు.

Update: 2020-02-20 14:51 GMT

దేశ రక్షణ కోసం అహర్నిశలు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్న సైనికుల కుటుంబాలను ఆదుకొని అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గారు అన్నారు. ఢిల్లీలో పర్యటినలో భాగంగా ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డుకు వెళ్లిన పవన్ అమరులైన సైనికుల కుటుంబాలకు, గాయపడిన సైనికులకి రూ.కోటి విరాళాన్ని అందించారు. దేశాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరూ సైనిక్ బోర్డుకు సహాయం అందించాలన్నారు .అది సైనిక కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

ఢిల్లి పర్యటనలో భాగంగా ఆర్‌.కె.పురంలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని పవన్ సందర్శించారు. పవన్ ని అక్కడి బోర్డు అధికారులు ఆత్మీయంగా స్వాగతించారు. బోర్డు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌ తరఫున ప్రత్యేక మెడల్‌, జ్ఞాపిక పవన్ కి బ్రిగేడియర్‌ మృగేంద్ర కుమార్‌ అందచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ సైనికుల కుటుంబాల సంక్షేమార్ధం కోటి రూపాయల విరాళాన్ని డి.డి. రూపంలో అందచేశారు.

ఇందులో భాగంగా పవన్ మాట్లాడుతూ... కేంద్రీయ సైనిక్‌ బోర్డుకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నానని, మా అమ్మ తరఫు తాతయ్య గారు, మా బంధువులు సైన్యంలో సేవలందించారు. సైనికులకు ఎదురయ్యే సవాళ్ళు, ఆ సేవల నుంచి విరమణ పొందాకా వచ్చే ఇబ్బందుల గురించి నాకు తెలుసు. వారి కోసం సైనిక్‌ బోర్డు తగిన సేవలు అందిస్తోంది. సైనికులు, వారి కుటుంబాల కోసం అండగా ఉండటం దేశ పౌరుడిగా నా బాధ్యత. ఈ అవకాశం ఇచ్చిన సైనిక్‌ బోర్డుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని పవన్ అన్నారు.

అనంతరం దిల్లీలో నిర్వహించిన 'ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌' లో పవన్ పాల్గొన్నారు. జాతీయ, ప్రాంతీయ రాజకీయాలను చూస్తూ పెరిగానని.. అధికారం కోసం చేస్తున్న రాజకీయాలను చూసి విసుగు చెందానన్నారు. రాజకీయంగా తమకు ఒకే ఎమ్మెల్యే ఉన్నారని.. కానీ, తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పవన్ వెల్లడించారు. రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటే సహనం ఓపిక కావాలని పవన్ అన్నారు. 

Tags:    

Similar News