దిశ ఉదంతం కనువిప్పు కావాలి : పవన్ కళ్యాణ్

దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోంది. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల

Update: 2019-12-06 08:14 GMT
pawan kalyan

షాద్ నగర్ హత్య కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురు నిందితులను ఈ రోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం చటాన్‌పల్లి దగ్గర సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో నలుగురు పోలీసులపై దాడికి ప్రయత్నించి.. పారిపోయే క్రమంలో కాల్చి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు చేసిన పనికి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. నిందితులకు సరైనా శిక్ష వేయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు పోలీసులుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు..ఆ లేఖలో దిశ ఉదంతం కనువిప్పు కావాలనీ, ఇటువంటి దురంతకులకు బహిరంగ శిక్షలు అమలు చేయాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ పూర్తి సారాంశం ఇది ...

"దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోంది. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోంది. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే. దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంటు తీసుకొచ్చింది. అయినా అత్యాచారాలు ఆగలేదు. అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతున్న సంఘటనలు తెలుపుతున్నాయి. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావలసిన అవసరం ఉంది.

ఇతర దేశాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలి. మేధావులు ముందుకు కదలాలి. వారి ఆలోచన శక్తితో ఇటువంటి నికృష్ట ఘాతుకాలకు చరమాంకం పాడాలి. ఇలాంటి కేసులలో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి. రెండు మూడు వారాలలోనే శిక్షలు పడేలా నిబంధనలు రావాలి. ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేయడానికి యోచన జరగాలి. నేర స్థాయినిబట్టి అది మరణ శిక్ష అయినా, మరే ఇతర శిక్ష అయినా సరే, బహిరంగంగా అమలు జరపాలి. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించింది. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అంటూ పేర్కొన్నారు.  

Tags:    

Similar News