విశాఖ పరిణామాలపై జనసేన పార్టీ ప్రతినిధులతో పవన్ చర్చ
Pawan Kalyan: అరెస్టయిన పార్టీ నాయకులు, వీరమహిళలకు అండగా నిలవాలి
విశాఖ పరిణామాలపై జనసేన పార్టీ ప్రతినిధులతో పవన్ చర్చ
Pawan Kalyan: విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ ప్రతినిధులతో చర్చించారు. అధికార పార్టీ నాయకులు పెట్టిన కేసులతో అరెస్టయిన జనసైనికులకు, కుటుంబసభ్యులకు అండగా నిలవాల్సిన అవసరంపై సమాలోచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్నవారికి అవసరమైన మందులు, ఆహారం సక్రమంగా అందించే బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పార్టీ ప్రతినిధులను కోరారు. అరెస్టయిన జనసేన పార్టీ నాయకులతోపాటు వీర మహిళలకు న్యాయ పరమైన సహాయం అందించే బాధ్యతను తీసుకున్నామని పవన్ కళ్యాణ్ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. అందుబాటులో ఉన్న సీనియర్ లాయర్లతో చర్చించిన పవన్ జనసైకులను విడిపించడానికి సంబంధించిన అనువైన మార్గాలను అన్వేషించాలని కోరారు.
విశాఖ విమానాశ్రయం వద్ద ఏపీ మంత్రులపై దాడి ఘటనలో అరెస్టు అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. 61 మందిని రూ.10వేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. 9 మందికి ఈనెల 28 వరకు రిమాండ్ విధించింది. 9 మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్‌గా మార్చి రిమాండ్ విధించారు.
అంతకుముందు హైడ్రామా మధ్య పోలీసులు జనసేన నేతలను ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ప్రాంగణం అన్ని గేట్లు దిగ్బంధం చేశారు. మరోవైపు 92 మంది జనసైనికులపై కేసు నమోదు చేసి 70 మందిని అరెస్టు చేసినట్లు జనసేన లీగల్ పేర్కొంది. అరెస్టు చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండ్ విధించారని, 61 మంది జనసైనికులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు జనసేన తెలిపింది.