ఓటమి ఓ పాఠం : పవన్ కళ్యాణ్

Update: 2019-06-06 17:21 GMT

ఓటమిని ఓ పాఠంగా తీసుకుని ముందుకు వెళతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.  మంగళగిరిలో అయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తమ ఓటమి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. తమది ఓటమిగా భావించడం లేదనీ, నాలుగున్నరేళ్ల తమ పార్టీకి లక్షలాది మంది ఓట్లేయడం విజయంగా భావిస్తున్నామన్నారు. తమ పార్టీకి ఓట్లు వేసిన అందరికీ, అదేవిధంగా పార్టీ మీటింగ్ లకు, తన యాత్రలకు వచ్చిన ప్రజలందరికీ ఈ సందర్బంగా ధన్యవాదములు చెబుతున్నాన్నారు. తాను రెండు చోట్లా ఓడిపోవడం పై అయన స్పందించారు. రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ, అక్కడి ఓటర్లను తాను కలుసుకోలేకపోయానన్నారు. అందుకే తాను రెండు చోట్లా ఓడిపోయినట్టు చెప్పారు. పార్టీని ఎదగనీయకుండా కొన్ని బలమైన శక్తులు పనిచేయడంతోనే వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. పార్టీకి బలీయమైన క్యాడర్‌ ఉందని ఈ ఎన్నికల్లో నిరూపితమైందన్నారు. ఓటమికి వ్యక్తులను కారణంగా చూపరాదన్నారు. పార్టీకి జనబలం ఉందని, ఆ బలాన్ని పార్టీ కోసం వినియోగించుకోవడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని నేతలకు సూచించారు. తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీని ముందుకు తీసుకెళ్తూనే ఉంటానని స్పష్టంచేశారు. ఒక్కోసారి ఊహించని ఫలితాలు చూడాల్సి ఉంటుందని, అలాంటి వాటిని ఎదుర్కోవాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక, ముందుచూపు అవసరమన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలను, ప్రణాళికలను ప్రచారం చేసుకోవడానికి గాను సెప్టెంబర్ నుంచి ఒక పక్ష పత్రిక ప్రారంభిస్తున్నట్టు పవన్ తెలిపారు.  

Tags:    

Similar News