Jagan: మరోసారి ఢిల్లీకి ఏపీ సీఎం జగన్..!

Jagan: జగన్ ఢిల్లీ టూర్‌పై పొలిటికల్ రగడ

Update: 2023-04-20 01:34 GMT

Jagan: మరోసారి ఢిల్లీకి ఏపీ సీఎం జగన్..!

Jagan: ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారా ? వివేకా కేసులో కీలక పరిణామాల వేళ జగన్ ఢిల్లీ బాట ఎందుకు పడుతున్నారు..? హస్తిన పెద్దలను కలిస్తే.. రాష్ట్ర సమస్యలు చర్చిస్తారా లేక వివేకా హత్య కేసు పరిణామాలపై మాట్లాడతారా? ఇప్పుడిదే టాపిక్‌పై ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన సమస్యలు కొంత మేర కొలిక్కి వచ్చిన నేపథ్యంలో.. ఆ అంశాలపై చర్చించేందుకు ఇవాళ ప్రభుత్వ కార్యదర్శుల కమిటి ఢిల్లీ వెళ్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రెండు రోజుల్లో ఢిల్లీకి వస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే సీఎం జగన్ విదేశీ పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన జగన్.. ఆర్థిక అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించినట్టు వైసీపీ నేతలు చెప్తున్నారు. సకాలంలో నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం పెద్దలతో చర్చించినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా సీఎస్ కూడా ప్రెస్ మీట్ లో ఇవే అంశాలను హైలైట్ చేశారు. గత ఢిల్లీ పర్యటనలో 10వేల కోట్లు ఏపీకి ఇస్తామని ప్రధాని చెప్పినట్టు వైసీపీ నేతలు అంటున్నారు. ఆ పర్యటన ఫలితంగా నాలుగు వేల కోట్లు కేంద్రం విడుదల చేసిందని.. మళ్ళీ ఈ వారంలో మూడు వేల కోట్లు కేంద్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ టైం లో సీఎం ఢిల్లీ పర్యటన సక్సస్ ఫుల్ గా పూర్తి చేసుకుని ఆర్థిక పరమైన ఇబ్బందులని అధిగమిస్తామంటోంది ఏపీ ప్రభుత్వం.

వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇప్పటికే కడప ఎంపీ అవినాస్ రెడ్డి తండ్రి YS భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. సహా నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ చెబుతుంది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టు ని ఆశ్రయించారు. 25న కోర్టు తుది తీర్పు రానుంది. అప్పటి వరకు సీబీఐ విచారణకు అవినాష్‌ హాజరుకావాలని కూడా ఆదేశించింది.

వివేకా కేసులో సీబీఐ దూకుడు పెంచడం.. సరిగ్గా ఇదే సమయంలో జగన్ ఢిల్లీ బాట పట్టడం వెనుక ఆంతర్యం ఎంటనే చర్చ మొదలైంది. గతంలో కూడా సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఒక్క మార్చి నెలలోనే జగన్ రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీతో పాటు, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత సీబీఐ విచారణలో వేగం తగ్గిందనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో సుప్రీంకోర్టులో వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకా కేసులో విచారణ అధికారిగా ఉన్న రాంసింగ్ ని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కేసుని ఏప్రిల్ 30లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త సిట్ ని ఏర్పాటు చేయడంతో పాటు విచారణలో వేగం పెంచింది సీబీఐ. వివేకా కేసులో అవినాష్‌ రెడ్డి అరెస్టు కాకుండా కాపాడేందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం జగన్ కి రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఈ విచారణ వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని అధికారపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో సీఎం జగన్.. ఢిల్లీ పర్యటనలో సీబీఐ అధికారుల తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది..

టోటల్‌గా ఏపీ సీఎం జగన్ హస్తిన టూర్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విభజన హామీలపై చర్చిస్తారా లేక.. వివేకా కేసులో సీబీఐ తీరుపై ఢిల్లీ పెద్దలకు కంప్లైట్ చేస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది.

Tags:    

Similar News