AP Elections 2021: ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు

AP Elections 2021: 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ * జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,058 మంది అభ్యర్థులు

Update: 2021-04-08 03:26 GMT

కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ (ఫైల్ ఇమేజ్)

AP Elections 2021: ఎన్నో అడ్డంకుల తర్వాత ఎట్టకేలకు ఏపీలో పరిషత్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 515 జడ్పీటీసీ, 7వేల 220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2వేల 58 మంది అభ్యర్థులు ఉండగా ఎంపీటీసీ బరిలో 18 వేల 782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే 126 జడ్పీటీసీ, 2 వేల 371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుండగా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరగనుంది. పరిషత్‌ ఎన్నికల్లో 2 కోట్ల 46 లక్షల 71వేల 2 మంది ఓటు వేయనున్నారు. ఇప్పటికే.. పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలివచ్చిన ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అలాగే.. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అలాగే.. విజయనగరంలో 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలు, విశాఖపట్నంలో 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలు, తూర్పుగోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ, వెయ్యి ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలు, కృష్ణా జిల్లాలో 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలు, గుంటూరులో 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలు, ప్రకాశం జిల్లాలో 41 జడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలు, నెల్లూరులో 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలు, చిత్తూరులో 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలు, కడపలో 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలు, కర్నూలులో 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలు, అనంతపురంలో 62 జడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

మరోవైపు పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల 751 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇందులో 247 నక్సల్ ప్రభావిత పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. 6 వేల 492 సున్నిత పోలింగ్ స్టేషన్లు, 6 వేల 314 కేంద్రాలను అతి సున్నిత పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఎన్నికల పరిస్ధితిని సమీక్షిస్తున్నారు అధికారులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్లను వినియోగిస్తున్నారు. 

Tags:    

Similar News