AP Night Curfew: ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ

AP Night Curfew: రాత్రి 10 గంటల నుంచి 5 వరకు అమలు * అత్యవసర సేవలకు మినహాయింపు

Update: 2021-04-25 03:25 GMT

ఆంధ్రపదేశ్ నైట్ కర్ఫ్యూ (ఫైల్ ఇమేజ్)

AP Night Curfew: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండటంతో ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే కర్ఫ్యూ నుంచి అత్యవసరసేవలకు మినహాయింపునిచ్చారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని కార్యాలయాలు, సంస్థలు, షాప్‌లు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఉదయం 5 గంటల తరువాతనే తెరవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆస్పత్రులు, డయాగ్నిస్టిక్, ల్యాబ్‌లు, ఫార్మసీ, ఔషధాల అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఆంక్షలను ఎవ్వరైనా అతిక్రమిస్తే రాష్ట్ర విపత్తుల నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆంక్షలను విధిగా అమలు చేయాల్సిందిగా కలెక్టర్లు, ఎస్‌పీలు, పోలీసు కమిషనర్లను సీఎస్‌ ఆదేశించారు. రాత్రి10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసే నిరంతర ప్రక్రియలో భాగంగా కొవిడ్‌ బాధితులకు చికిత్సను అందించడం, పరీక్షలు చేయడం వంటి ప్రక్రియలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి మాస్కును మించిన ఆయుధం లేదని, పగటి వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పరిస్థితులను సమీక్షించిన తర్వాతే రాత్రి కర్ఫ్యూ విధించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

Tags:    

Similar News