మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

విజయవాడ సింగ్ నగర్ లో తనిఖీలు చేసిన ఎన్ఐఏ

Update: 2022-07-19 07:55 GMT

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

NIA Raids: ప్రకాశం జిల్లా, విజయవాడలో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో ప్రకాశం జిల్లాతో పాటు విజయవాడలోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలపాల నిరోధ చట్టం ఉపాను రద్దు చేయాలంటూ విరసం నేతలు విజయవాడలో ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో రెండు ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషతో పాటు విరసం నేత కల్యాణ్ రావు ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. శిరీష ఇంట్లో లేకపోవడంతో తాళం పగలగొట్టి మరీ సోదాలు చేపట్టారు.

విజయవాడలోనూ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. సింగ్ నగర్ లోని విరసం నేత దొడ్డి ప్రభాకర్ నివాసంలో తనిఖీలు చేశారు. మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చెపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు సింగ్ నగర్ లోని ఓ ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాళ్లు ఎవరనే దానిపై ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. సోదాల పేరుతో ఎన్ఐఏ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్కే భార్య శిరీష ఆరోపించారు. భర్త, కుమారుడు చనిపోయిన బాధలో తాముంటే విచారణ పేరుతో, సోదాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె తెలిపారు. 

Tags:    

Similar News