పవన్ సీఎం ప్రకటన.. సోము అవుట్?

*ఇప్పటికే సోము వీర్రాజకు వ్యతిరేకంగా పార్టీలో గ్రూపులు

Update: 2022-05-30 07:13 GMT

త్వరలో ఏపీకి కొత్త బీజేపీ చీఫ్.. జులై 26తో ముగియనున్న సోము పదవీ కాలం

Andhra Pradesh: ఏపీలో అంతంతగానే ఉన్న కమలం పార్టీ కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయ్. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహరశైలితో పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువవుతున్నాయ్. బీజేపీ, జనసేన రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్న తరుణంలో గత ఏడాదిగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం మిత్రపక్షం జనసేనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిగా ఇద్దరు నేతల మధ్య మాటలు కూడా లేవంటున్నారు. సోము తీరు వల్లే ఆయన్ను పవన్ కల్యాణ్ దూరం పెట్టారన్న వర్షన్ విన్పిస్తోంది.

తాజాగా బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ అంటూ లీకులు రావడంతో పార్టీ జాతీయ నాయకత్వం అప్రమత్తమయ్యింది. అసలు ఈ వార్త ఎవరు బయటకు ప్రచారం చేస్తున్నారన్న దానిపై పార్టీ హైకమాండ్ ఆరా తీస్తోంది. బీజేపీ సీఎం అభ్యర్థిని ఎప్పుడూ కూడా ముందుగా నిర్ణయించరని పార్టీలో ఇలాంటి వర్షన్లు ఎందుకు బయటకొస్తున్నాయని ఆరా తీయడం మొదలుపెట్టారు. సీఎం అభ్యర్థి విషయంలో పార్టీ ఎప్పుడూ కూడా ఆచితూచి వ్యవహరిస్తోందని అందుకు ఉత్తరాఖండ్, గోవా నిదర్శనమంటున్నారు పార్టీ నేతలు. గోవాలో సీఎం గెలిచినా నిర్ణయించడానికి 15 రోజులు తీసుకున్నారని ఉత్తరాఖండ్‌లో సీఎం ఓడినా మళ్లీ కొత్తగా ఎన్నుకోడానికి రెండు వారాల సమయం తీసుకున్నారని అలాంటిది ఏపీ విషయంలో ఆఘమేఘాలపై నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటున్నారు. సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అనవసర ప్రకటనలు చేయడంతో పార్టీ ఇజ్జత్ పోతోందంటోంది హైకమాండ్. పార్టీని పలుచన చేసే ప్రకటనలు చేయొద్దని నేతలకు ఢిల్లీ పెద్దలు వార్నింగ్ కూడా ఇచ్చారట.

పవన్ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించబోతున్నారంటూ వచ్చిన మీడియా ప్రకటన వెనుక ఎవరున్నారన్నదానిపై పార్టీ హైకమాండ్ ఆరా తీస్తోంది. సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఇష్యూలు ఎందుకొస్తున్నాయని ఢిల్లీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. సోము వీర్రాజకు వ్యతిరేకంగా పార్టీలో చాలా మంది నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సోము ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీకి తలపోటు కలుగుతోందన్న అభిప్రాయం అగ్రనాయకత్వంలో కలిగినట్టు తెలుస్తోంది. అయితే జులై 6న జేపీ నడ్డా ఏపీ టూర్‌పై కోసమే పవన్ సీఎం అన్న ప్రకటన తెరిపైకి తెచ్చారన్న చర్చ సాగుతోంది.

ఐతే ఈ ప్రకటన వెనుక అతి తెలివి కూడా ఉందట. బీజేపీ చీఫ్ నడ్డా టూర్‌కు సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభకు జనసేన కార్యకర్తలు వస్తే... ఆ పని తమకు ఈజీ అవుతోందనే అలాంటి లీకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ అభిమానులు లేకుంటే జనసమీకరణ చేయడం కష్టమనే ఇలాంటి ప్రకటనను బయటకు వచ్చేలే చేశారని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఉమ్మడి సీఎం అభ్యర్థి అంటూ ప్రకటనలు వచ్చాయంటున్నారు. మొత్తంగా సోము తీరుతో పార్టీ హైకమాండ్ ఆగ్రహం ఉందని తెలుస్తోంది. సోమువీర్రాజు వ్యవహరంలో ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు జులై 26తో కొత్త చీఫ్ ను తెరపైకి తీసుకురాబోతున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మరో ఛాన్స్ ఇచ్చే విషయాన్ని కూడా హైకమాండ్ ఆలోచిస్తోంది. ఇక పురంధేశ్వరితోపాటు మాధవ్, సత్య కుమార్ సైతం రేసులో ఉన్నారంటున్నారు నేతలు. 

Tags:    

Similar News