Election Counting: ఇవాళ నెల్లూరు, కుప్పంలో ఎన్నికల కౌంటింగ్

Election Counting: అధికార, ప్రతిపక్షాల మధ్య రసవత్తర పోరు

Update: 2021-11-17 01:18 GMT

నెల్లూరు మరియు కుప్పం లో ఎన్నికల ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)

Election Counting: ఏపీలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా రసవత్తరంగా జరిగింది. మొత్తం అన్ని చోట్లా అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ రెండు పార్టీలు యుద్ధ వాతావరణం క్రియేట్ చేశాయి. అలాగే నెల్లూరు, కుప్పం ఎన్నికలలో ఘర్షణలు మరింతగా చోటు చేసుకున్నాయి. దీంతో ఇవాళ కౌంటింగ్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు, జగన్‌కు అత్యంత కీలకంగా మారింది.‌

ఇక పోలింగ్‌ సమయంలో దొంగ ఓట్ల వ్యవహారం పలు ఉద్రిక్తతలకు దారి తీసింది. అధికార పార్టీ కుప్పంలో ఏకంగా తమిళనాడు నుంచే దొంగ ఓటర్లను బస్సులో తీసుకొచ్చిందని తేల్చారు టీడీపీ నేతలు. ఎన్నికల సిబ్బంది అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఈ అంశాలపై ఈసీకి వరుస కంప్లయింట్లు కూడా అందాయి. అలాగే దర్శిలో కూడా దొంగ ఓట్లపై ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యేనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ టీడీపీ ఆరోపించింది. అదేంకాదు టీడీపీనే దొంగ దొంగ అంటూ వైసీపీ నేతలు కూడా రుజువులతో కంప్లయింట్లు ఇచ్చారు.

ఇదిలా ఉంటే నెల్లూరులోనూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ ఓట్లు అభ్యర్ధించడంపై టీడీపీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. 8, 10, 49, 50 డివిజన్లలో కొందరు ఓటర్లు రెండోసారి ఓటు వేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు స్పందించలేదని ఆరోపించారు టీడీపీ నేతలు. జెండా వీధిలోని సీఎం హైస్కూల్ వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అబ్దుల్ అజీజ్‌ను వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బుచ్చిరెడ్డిపాలెం 14వ వార్డులోనూ దొంగ ఓట్లపై బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.

కుప్పంలో స్ధానికేతరులకు చీటీలు పంచడంపై రగడ జరిగింది. మహిళలను పెద్ద సంఖ్యలో దింపి అధికార పార్టీ దొంగ ఓట్లు వేయిస్తోందని ఆర్వోలకు ఫిర్యాదులందాయి. వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధీర్ పోటీ చేస్తున్న చోట ఇతర ప్రాంతాల వారు ఓటు వేసేందుకు రావడంతో గలాటా మొదలైంది. వారిని పోలీసులకు అప్పగించినా చర్యలు లేవంటూ ఆరోపించారు టీడీపీ నేతలు. ఏదేమైనా ఇవాళ జరగబోయే కౌంటింగ్‌ మరింత ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Full View


Tags:    

Similar News