పేటిఎంలో 5 రూపాయలు వేస్తే పోస్ట్ పెడతారు, 3 రూపాయలు వేస్తే లైక్ కొడతారు : నారా లోకేష్

Update: 2019-12-11 02:34 GMT

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ వైసీపీ కార్యకర్తలను ఉద్ద్యేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు పేటిఎం బ్యాచ్ అని వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన లోకేష్.. సీఎం జగన్ గతంలో మాట తూలిన సందర్భాలను వీడియోలో చూపించారు. తాను అమెరికాలో చదువుకున్నానని అంతమాత్రాన తెలుగులో అటు ఇటు అయితే ఇంత రాదంతం చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలకు పేటిఎంలో ఐదు రూపాయలు వేస్తే పోస్ట్ పెడతారు, మూడు రూపాయలు వేస్తే లైక్ కొడతారని అన్నారు. అసెంబ్లీలో తాను సభ్యుడిని కానప్పుడు నా గురించి ఎందుకు సభలో ప్రస్తావిస్తున్నారని అన్నారు. అయితే శాసన మండలిలో తాను ఉంటానని కావాలంటే ఎవరొస్తారో వచ్చి తనతో చర్చించాలని సవాల్ విసిరారు.

వైసీపీ ఆరునెలల పరిపాలనలో సాధించిన ప్రగతి ఏంటి? ఒక్క ఐటీ కంపెనీ తెచ్చారా..? ఇంకేమైనా కంపెనీలు రాష్ట్రానికి తెచ్చారా? అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి చాలా నిధులు తీసుకొచ్చానని.. అలాగే కంపెనీలు సైతం తీసుకొచ్చానని అన్నారు. మంగళగిరిలో ఓడిపోయినంత మాత్రాన వదిలేసి వెళ్లనని అన్నారు.. మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ విమర్శలపై మాట్లాడాల్సింది ఏమి లేదని.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. ఇకనైనా శాసనసభలో వ్యక్తిగత విమర్శలు మాని ప్రజాసమస్యలను పరిష్కరించాలని సూచించారు లోకేష్. 

Tags:    

Similar News