నేత్రపర్వంగా సాగుతున్న తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర

పలు వేషాలువేసి మొక్కులు చెల్లించుకున్న ముస్లింలు

Update: 2022-05-15 01:00 GMT

తిరుపతి గంగమ్మ జాతరకు సారెను సమర్పించిన ముస్లిం భక్తులు

Tirupati: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేత్రపర్వంగా సాగుతోంది. వందల‌ యేళ్ళ నాడు తిరుపతిని పాలించే పాలేగాళ్ళ ఆగడాలు సృతిమించి మహిళలను చెరబడుతుంటే కైకాల వారి ఇంట పుట్టిన గంగమ్మ తిరగబడి పాలేగాడిని సంహరించింది. అప్పటి వరకు పురవీధుల్లో తిరుగాడాలంటేనే గడగడలాడే మహిళలకు సంకెళ్ళు తెగిన సంబురం కనిపించింది. ఇంట్లో ఆడపిల్లను భద్రంగా ఎలా ఉంచుకోవాలా అని కుమిలిపోయే ఎన్నో కుటుంబాలకు పండుగొచ్చింది. ఊరి జనం ఆ తల్లికి కర్పూర హారతులిచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గంగమ్మకు ఊరి ప్రజలు చేసిన పూజల పరంపరే ప్రతి ఏటా జరుగుతున్న జాతర. వేషాలతో, బూతుమాటలు, పాటలతో వారం రోజులపాటూ సాగే తిరుపతి గంగజాతరకు దేశ, విదేశాల్లోనూ విశేష గుర్తింపు ఉంది.

ఆ భూతు మాటలు.. పాటల వెనుక పెద్ద వ్యూహమే ఉంది. గడప దాటితే ఆడవాళ్లకు భద్రత లేని ఆ రోజుల్లో కనిపించిన స్త్రీ పై పాలెగాడి ఆకృత్యాలు విచ్ఛలవిడిగా సాగేవి. ఒక నాడు అవిలాల ఆడబిడ్డ గంగమ్మ మీద పడింది అతని కన్ను. తన కాంక్ష తీర్చమని కబురు పెట్టాడు. గంగమ్మ లెక్క చేయలేదు. మొదటి సారి ఆడదాని ధిక్కారాన్ని సహించలేకపోయాడు ఆ పాలెగాడు. కోరిక తీర్చమంటూ చేయిపట్టుకున్నాడు. అంతే పౌరుషాగ్నితో రగులుతున్న గంగమ్మ రూపు చూసిన పాలెగాడు గడగడ వణికిపోయాడు. పాలెగాడు కలుగుల్లో, గుంతల్లో, గుట్టల్లో దాక్కో సాగాడు. ఈ సందర్భంగా గంగమ్మ రోజుకో వేషం మార్చుతూ వెతికింది. పాలెగాడు పౌరుషంతో బయటకు రావాలని బూతులు తిడుతూ తిరిగింది. అయినా అతను బయటకు రాలేదు. పాలెగాడి స్వభావం ఎరిగిన గంగమ్మ చివరికి దొర వేషం వేసింది. నిజంగా దొర వచ్చాడని పాలెగాడు బయటకు వచ్చాడు. అప్పటికే రగిలిపోతున్న గంగమ్మ పాలెగాన్ని నరికి సంహరించింది. అందుకే తిరుపతి గంగజాతరలో రోజుకో వేషం వేసుకుని గంగమ్మ పౌరుషాన్ని ఆవాహన చేసుకుంటున్నారు భక్తులు.

తిరుపతి పుట్టినప్పటి నుంచీ అంటే దాదాపు 900 ఏళ్ల నుంచే గంగజాతర జరిగేదని కొందరు చెబుతారు. శ్రీవారితో స్నేహంగా పరాచకలాడిని అనంతాచర్యులు ఈ ఆలయాలన్ని ప్రతిష్టించినట్టు చెబుతారు. అనంతాచార్యులను శ్రీవారు తాతా..తాతా..అని పిలిచేవారని, ఈకారణంగానే తాతయ్యగుంటగా ఈ ప్రాంతం ప్రాచుర్యం పొందిందని ప్రసిద్ధి. 1843లో బిట్రీష్‌ ప్రభుత్వం హథీరాంజీ మఠంకు తిరుమల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన సమయంలో తిరుమల ఆలయంతో పాటు దాదాపు 26 స్థానిక ఆలయాలను అనుబంధంగా అప్పగించారు. అందులో గంగమ్మ ఆలయం కూడా ఉంది. అయితే టీటీడీ ఏర్పడిన తర్వాత జంతుబలులు జరిగే ఆలయం టీటీడీ ఆధీనంలో ఉండడం సరికాదనే ఉద్దేశ్యంతో జాబితా నుంచి ఈ ఆలయాన్ని తొలగించారని చెబుతారు. అయినప్పటికీ శ్రీవారికి చెల్లెలుగా గంగమ్మని భావిస్తారు. అందుకే ప్రతి ఏటా తిరుమల ఆలయం నుంచి సారె సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది.

తిరుపతి గంగమ్మ జాతరకు ముస్లీంల సారెతీసుకొచ్చారు. తిరుపతి నగరంలో మతసామరస్యానికి ప్రతీకగా కొందరు ముస్లీంలు గంగమ్మ జాతరలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముస్లీంలు వేషాలు వేసి మ్రొక్కులు చెల్లించారు. తిరుపతి జీవకోనలోని ముస్లీంలు మసీదు నుంచి సారెతో స్థానికంగా ఉన్న గంగమ్మ ఆలయానికి వచ్చి పూజలు చేయడం అందరినీ ఆకర్షించింది. మతసామరస్యం ఫరిడవిల్లే ఈ ప్రయత్నం అభినందీయమని కొనియాడారు నగర వాసులు. అమ్మవారి ఆలయంలోనూ వారికి పూజారులు అపూర్వ స్వాగతం పలికి సారెను స్వీకరించారు.

Tags:    

Similar News