గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) ఎన్నికలను ఫిబ్రవరిలో లేదా అంతకంటే ముందే నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోందని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయ అన్నారు. మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీలకు ఫిబ్రవరి లోపే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రాంతంలోని ఐదు గ్రామాల విలీనానికి సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉన్నందున, ఇక్కడ మునిసిపల్ ఎన్నికలకు ఆలస్యం అవుతోందని మంత్రి చెప్పారు. త్వరలోనే రిజర్వేషన్ల తుది జాబితా ప్రభుత్వానికి అందుతుందని అన్నారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు గురించి మాట్లాడిన మంత్రి.. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు చెప్పారు. గాజువాకా-కొమ్మడి ప్రాజెక్టును స్టీల్ ప్లాంట్ వరకు విస్తరించాలని, స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లె ప్రాజెక్టును భోగాపురం వరకు విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు.
సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారుచేసిన తరువాత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేస్తారు అని మంత్రి పేర్కొన్నారు. రాజధాని నగరం గురించి కూడా మాట్లాడిన బొత్స "నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, రాజధాని నగరంపై త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది. అని అన్నారు. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తరువాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అసంపూర్తిగా ఉన్న భవనాలు అంటే.. 55 శాతం పనులు ఇప్పటికే పూర్తయిన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించిన విషయాన్నీ గుర్తు చేశారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ పాల్గొన్నారు.