మరో మూడు రోజుల్లో అల్పపీడనం - విస్తరిస్తున్న రుతుపవనాలు!

ఇప్పటికే కేరళకు ప్రవేశించిన నైరుతి రుతువపనాలు మరో నాలుగైదు రోజుల్లో ఏపీలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Update: 2020-06-05 01:04 GMT

ఇప్పటికే కేరళకు ప్రవేశించిన నైరుతి రుతువపనాలు మరో నాలుగైదు రోజుల్లో ఏపీలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు వాతావరణ ప్రభావం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతోంది. ఇది మూడు, నాలుగు రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని చెబుతోంది.

మహారాష్ట్రలో తీరందాటిన నిసర్గ తుఫాన్‌ బలహీనపడి ఈశాన్యంగా పయనించి వాయుగుండంగా మారింది. గురువారం ఉదయానికి విదర్భ, ముధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో వీచిన గాలులతో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల గాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. కొత్తవలస, అనకాపల్లి, గోకవరం, ఎలమంచిలిలో 4సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. ఈ నెల 8నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో 9, 10 తేదీల్లో రాయలసీమ, కోస్తాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు.

శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా, విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం మొగలిపురంలో గురువారం పిడుగుపడి ఉపాధి కూలీ బైలపూడి చెల్లమ్మ(59) అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగంపల్లి చెల్లమ్మ(40), శిరపురపు రమణమ్మ (40) పరిస్థితి విషమంగా ఉంది.

 

HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Tags:    

Similar News