MLA Assures over the Deaths in the Hospital: ఆ ఆసుపత్రిలో వరుస మరణాలు.. రోగులకు దైర్యం నింపిన ఎమ్మెల్యే

Update: 2020-07-29 07:59 GMT

MLA assures over the deaths in the hospital: కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరే రోగుల వ్యధ వర్ణనాతీతంగా మారింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో అలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. దాంతో ఏకంగా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చోరవ చేసుకొని వైద్యులు, అధికారులపై క్లాస్ తీసుకున్నారు.

అనంతపురంలో సర్వజన ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండి కూడా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సంఘటనపై కలెక్టర‌్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తుల విషయంలో వైద్యులు, ఆస్పత్రి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే స్వయంగా వార్డులు తిరుగుతూ కరోనా రోగులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

అనుమానిత లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్న వారికి వైద్యం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్న విషయం పై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 24 నుంచి 26వ తేది వరకు దాదాపు 30 మంది మృత్యువాతపడ్డారు. ఆసుపత్రిలో కరోనా రోగుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని సకాలంలో వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. ఇకపై ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అందుకు ఆస్పత్రి అధికారులు, వైద్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ ఘటనపై కలెక్టర్ గంధం చంద్రుడు స్పందిస్తూ కరోనా రోగులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో ఆసుపత్రిలో కొన్ని లోపాలు, పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జరిగిన వరుస ఘటనలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సర్వజన ఆస్పత్రి ఘటనపై స్పందించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. పెద్దలు ఇచ్చిన భరోసాతో తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు నిరుపేదలు.

Tags:    

Similar News