AP Lockdown: ఏపీలో ప్రారంభమైన మినీ లాక్‌డౌన్

AP Lockdown: రెండు వారాల పాటు అమల్లో ఉండనున్న డే కర్ఫ్యూ * ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగేందుకు అనుమతి

Update: 2021-05-05 06:39 GMT

Representational Image

AP Lockdown: ఏపీలో మినీలాక్‌డౌన్ ప్రారంభమైంది. రెండు వారాల పాటు డే కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. రోజుకు 20వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్షిక లాక్‌డౌన్ ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన నేపథ్యంలో.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయింది. కర్ఫ్యూ సమయంలో ఆర్టీసీ బస్సులు సహా ఇతర ప్రజారవాణా వాహనాలన్నింటిని నిలిపివేయనున్నారు. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను నిలిపివేయాలని నిర్ణయించారు. అన్ని సంస్థలు, కార్యాలయాలు తప్పనిసరిగా నిబంధనలు, ఆంక్షలు పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో డే లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధికారికంగా జీవో ఆర్టీ నెంబర్ 192ని ప్రభుత్వం విడుదల చేసింది. కర్ఫ్యూ ఈనెల 18వరకూ అమలులో ఉంటుందని జీవోలో పేర్కొంది. లాక్‌డౌన్ నుంచి ఆస్పత్రులు, ల్యాబ్‌లు, మెడికల్ షాపులకు సడలింపు ఇచ్చారు. అత్యవసర సర్వీసులు అయిన మీడియా, పత్రికల సిబ్బంది, టెలి కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సేవలు, కేబుల్ సర్వీసులు, ఐటీ అనుబంధ సర్వీసులకు కూడా మినహాయింపు ఇచ్చారు. పెట్రోల్ పంపులతో పాటు తయారీ పరిశ్రమల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పని చేయడానికి అనుమతి ఇచ్చారు. వ్యవసాయం, వాటి అనుబంధ పనులు, ఉత్పత్తుల సేకరణకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పెళ్లిళ్లకు 20 మందికి అనుమతి ఇచ్చారు. అయితే.. స్థానిక అధికారుల అనుమతితో నిర్వహణకు అనుమతి ఇచ్చారు. సెక్షన్ 144 అమలుపై కలెక్టర్‌లు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొంది. అయిదుగురు కన్నా ఎక్కువగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. భౌతికదూరం పాటించి క్యూలో నిలబడే వారి విష‍యంలో దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిని సెక్షన్ 51 నుంచి 60 వరకూ విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు హెల్త్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags:    

Similar News