దూసుకు వస్తున్న మిడతలు.. తెలుగు రాష్ట్రాల్లో మిడతల కలవరం

రెండు నెలలుగా కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కనిపించే శత్రువు దాడి చేసేందుకు దూసుకువస్తోంది.

Update: 2020-05-29 14:30 GMT

రెండు నెలలుగా కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కనిపించే శత్రువు దాడి చేసేందుకు దూసుకువస్తోంది. లక్షల కొద్ది ఆకాశంలో ఎగిరి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలను అంత కలవర పెడుతున్న ఆ శత్రువు ఎవరు..?

కొద్ది నెలలుగా ఉత్తర భారతాన్ని వణికించిన మిడతలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు పయనం మొదలు పెట్టాయి. మహారాష్ట్రలోకి ప్రవేశించిన మిడతల దండు తెలుగు రాష్ట్రాల వైపు పరుగులు పెడుతున్నాయి. మేము వస్తున్నాం కాచుకోండి అంటూ ఇటు రైతులకు, అటు అధికారులకు సవాల్ విసురుతున్నాయి మిడతలు.

నిజామాబాద్ జిల్లా సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలోని వార్దాలో, నాగ్‌పూర్‌లో పంటలపై మిడతలు దాడి చేస్తున్నాయి. మిడతలు పక్క రాష్ట్రం మహారాష‌్ట్రకు రావడంతో తెలంగాణ సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. మిడతలు పంటలపై వాలితే తమ పంట నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిడతల దండుపై అధికారులు అప్రమత్తం అయ్యారు. మిడతలపై మందు స్ర్పే చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాలో మూడు ఫైరింజన్లు సిద్ధం చేశారు. మిడతలను పరిసర గ్రామాల్లో గుర్తిస్తే పొలాల వైపు రాకుండా డబ్బాలు, మెటల్ ప్లేట్లు, డ్రమ్ములు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచనలు చేశారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో మిడతలు చెట్లను తింటూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. స్థానికంగా ఉన్న జిల్లేడు చెట్లను టార్గెట్ చేసుకొని.. ఒక చెట్టు ఖాళీ అయిన తర్వాత మరో చెట్టుకు వెళ్తున్నాయి మిడతలు. వందల సంఖ్యలో మిడతలు చెట్ల ఆకులను తింటుండడంపై స్థానికులు అప్రమత్తమై, అధికారులకు సమాచారం ఇచ్చారు.

విశాఖ జిల్లా అనకాపల్లి కసింకోట మండలం అచ్చర్ల గోకువానిపాలెం గ్రామంలో పంటలపై మిడతల గుంపు దాడి చేసింది. రైతుల ఫిర్యాదుతో పంటలను హార్టికల్చర్ అధికారులు పరిశీలించారు. వాటిని ఫొటోలు తీసి జోధ్ ఫూర్ లో ఉన్న శాస్త్రవేత్తలకు పంపారు. అయితే అవి ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వలస మిడతలు కావని వానాకాలం ముందు సహజంగా వచ్చే మిడతలేనని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. రైతులను పురుగుమందు చల్లాలని సూచించారు. మిడతల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని... పంట చేన్ల వద్ద కాపలా ఉండి పంటలపై మిడతలు దాడి చేయకుండా చూసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి





Tags:    

Similar News