Tirumala: బాలుడిపై దాడి చేసిన చిరుత.. బోనులో చిక్కింది

Tirumala: చిరుత కదలికలను గుర్తించేందుకు 100పైగా కెమెరాల ఏర్పాటు

Update: 2023-06-24 02:40 GMT

Tirumala: బాలుడిపై దాడి చేసిన చిరుత.. బోనులో చిక్కింది

Tirumala: మొన్న రాత్రి తిరుమల మెట్ల మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుత బోనుకు చిక్కింది. బాలుడిపై చిరుత దాడి చేసిందన్న విషయం తెలియగానే దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. మెట్ల మార్గానికి సమీపంలోని పలు ప్రాంతాల్లో బోన్లతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బాలుడిపై దాడి చేసిన ఒక్కరోజులోనే చిరుత బొనుకు చిక్కింది.

అటవీశాఖ అధికారులు రెండుచోట్లు బోన్లతో పాటు.... 100కు పైగా ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం బోనులు ఏర్పాటు చేయగా.. రాత్రి 11 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కింది. దీంతో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయ్యిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుత బోనులో చిక్కడంతో భక్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయనున్నారు.

ఈ చిరుతకు ఏడాదిన్నర వయసు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే వేటాడే లక్షణాలు అలవాటు అవుతున్నాయని.. అందుకే బాలుడిని లాక్కెళ్లిన సమయంలో వదిలేసినట్లు చెబుతున్నారు. వేటాడే లక్షణాలు లేవు కాబట్టే బాలుడు బయటపడగలిగారన్నారు. ఈ చిరుత పిల్లిని వేటాడుతూ భక్తులు వెళ్లే మార్గంవైపు వెళ్లిందని.. పిల్లి తప్పించుకోవడంతో బాలుడిపై దాడికి ప్రయత్నించిందని చెప్పారు. ఈ ఘటన యాధృచ్చికంగా జరిగిన ఘటనగా చెబుతున్నారు. ఈ చిరుత తల్లి నుంచి ఈ మధ్యే వేరుగా ఉంటోందని.. పిల్లి అనుకుని బాలుడిని వేటాడే ప్రయత్నం చేసిందన్నారు.

చిరుత దాడి నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత గాలిగోపురం నుంచి 2 వందల మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపించేలా ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డు ఉంటారని అన్నారు. చిన్న పిల్లలు బృందం మధ్యలో ఉండేలా చూసుకోవాలని.. అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి నడక మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు.

Tags:    

Similar News