కృష్ణపట్నం పోర్టులో ఊపందుకున్న బెర్తుల నిర్మాణం
కృష్ణపట్నం పోర్టు బకింగ్‌హామ్ కాలువ వెంబడి బెర్తుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు బకింగ్‌హామ్ కాలువ వెంబడి బెర్తుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే వాయువ్య దిశలో మూడు బెర్తులు పూర్తి అయి నౌకల్లోకి సిమెంటు లోడింగ్, ముడి నూనె దిగుమతి జరుగుతోంది. కొత్తగా వచ్చే చిన్న నౌకలు, కోస్ట్‌గార్డు నౌకలు నిలుపుకునేందుకు కాలువ వెంబడి నిర్మాణం చేస్తున్నారు. తూర్పు, పడమర, దక్షిణాన మొత్తం 17 బెర్తులు సేవలందిస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతలు సత్వరమే జరిగేందుకు కాంక్రీటు పనులు చేపట్టారు.
ఈప్రాంతంలోనే పొద్దు తిరుగుడు, పామాయిల్, తదితర నూనెల నౌకలు ప్రస్తుతం నిలుపుతున్నారు. కొత్త బెర్తులు పూర్తయితే, పోర్టుకు దూరంగా ఉంచే మధ్యస్థ నౌకల రాకపోకలకు అవకాశం ఉంది. మరో మూడు నెలల్లో అన్ని పనులు పూర్తి చేసేందుకు, పోర్టు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.