ఈ ఒప్పందం చరిత్రాత్మకం: సీఎం జగన్‌

కడప స్టీల్ ప్లాంటుకు ఇరాన్ ఓర్ సరఫరాపై ఒప్పందం కుదిరింది.

Update: 2019-12-18 09:15 GMT
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌ మెహతా

కడప స్టీల్ ప్లాంటుకు ఇరాన్ ఓర్ సరఫరాపై ఒప్పందం కుదిరింది. ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (కమర్షియల్‌) అలోక్‌కుమార్‌ మెహతా, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సీఎండీ పీ.మధుసూదన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎన్‌ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చరిత్రాత్మకం అని అన్నారు. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజల జీవితాలను మార్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా తాజా అంగీకారంతో కడప జిల్లా ప్రజలు దశాబ్దాల కళ సాకారం కానుంది. కడప స్టీల్‌ ప్లాంట్‌కు సీఎం జగన్‌ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాటు ముమ్మరం చేశారు. డిసెంబరు 23న జమ్మలమడుగు మండల పరిధిలోని పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల మధ్యలో ఉక్కు పరిశ్రమకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

గతేడాది నాటి సీఎం చంద్రబాబునాయుడు మైలవరం వద్ద కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అయితే, ప్రభుత్వం మారడంతో కడప స్టీల్ ప్లాంట్‌కు మళ్లీ భూమిపూజ చేయనున్నారు జగన్. ఇదిలావుంటే స్టీల్ ప్లాంటు ఏర్పాటుతో జమ్మలమడుగు మండలంలో భూమి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. జూలైలో ముఖ్యమంత్రి ప్రకటనకు ముందు ఎకరానికి నీటిపారుదల భూమి ధర రూ .7 నుంచి రూ .10 లక్షలకు పెరిగితే, తాజాగా రూ .50 లక్షలకు వరకు పెరిగింది, అంతేకాకుండా బీడు భూముల ధరలు అంతకు ముందు రూ .5 లక్షల ఉంటే ఇప్పుడు అవి 25 లక్షలకు పెరిగినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News