కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ఏర్పాట్లు షురూ..

Update: 2019-12-15 11:38 GMT

ఈనెల 26న కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె వద్ద ముఖ్యమంత్రి ఉక్కు కర్మాగారానికి టెంకాయ కొట్టి భూమిపూజ చేస్తారు. అనంతరం జమ్మలమడుగులో ఏర్పాటు చేసే బహిరంగసభలో జగన్ ప్రసంగించనున్నారు. ఆరోజు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పరిశీలించారు.

శంకుస్థాపన కార్యక్రమానికి సుమారు 25 వేల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. కడప జిల్లా కలెక్టర్, ఎంపీ అవినాష్ రెడ్డి ఓ దఫా ఈ స్థలాన్ని పరిశీలించారు. రేపు అధికారికంగా సభా స్థలాన్ని ఖరారు చేయనున్నారు. 20వేల మందికి ఉపాధి కల్పించే కడప స్టీల్ ప్లాంట్‌ను మూడేళ్లలోనే పూర్తి చేస్తామని ఇదివరకే సీఎం జగన్ ప్రకటించారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద శాతం పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వమే పెడుతోంది.

స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్‌లో రూ. 250కోట్లను కేటాయించారు. ఇందుకోసం ఇనుప ఖనిజాన్ని ఎన్‌ఎమ్‌డిసి నుండి సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది, ఏపీ ప్రభుత్వం త్వరలో ఎన్‌ఎమ్‌డిసితో ఎంఓయుపై సంతకం చేయనుంది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. మరోవైపు జిల్లాలో.. కుందూ నది మీద రాజోలు - జలదరాశి ప్రాజెక్టులకు కూడా త్వరలో కొబ్బరికాయ కొట్టనున్నారు.

కుంది నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మం సాగర్ ప్రాజెక్టులో నీటిని నింపుతామన్నారు. కాగా ముఖ్యంమత్రి సొంత జిల్లాలో జరగబోతోన్న మొట్టమొదటి శంకుస్థాపన కార్యక్రమం ఇది కాబట్టి ఇందుకోసం పోలీస్ యంత్రాంగం ఇప్పటినుంచే ఏర్పాట్లను చేస్తోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కర్రలతో మెస్ లు ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిసారించారు.  

Tags:    

Similar News