AP Municipal Elections: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం.

AP Municipal Elections: తాడిపత్రి మున్సిపాలిటీని తెదేపా, మైదుకూరులో వైసీపీ పాగా వేసింది.

Update: 2021-03-18 09:41 GMT

జేసీ ప్రభాకర్ రెడ్డి (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Municipal Elections: రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కు తెరపడింది. టీడీపీకి మెజార్టీ స్థానాలు ఉన్నప్పటికీ చైర్మన్ కుర్చీకోసం వైసీపీ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అనూహ్య పరిణామాల మధ్య ఈ మున్సిపాలిటీని తెదేపా కైవసం చేసుకుంది. పురపాలిక ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. మూడు రోజుల కిందట ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్‌ కమిషనర్‌ తిరస్కరించిన నాటి నుంచి ఈ ఛైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికతో దీనికి తెరపడింది. ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు శిబిరాలు సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి సయ్యద్ భాషాకు 18 ఓట్లు పోల్ అవ్వగా.. టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డికి 21 ఓట్లు పడ్డాయి. పాలక మండలిని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 20. ఆ సంఖ్యను టీడీపీ అందుకోవడం వల్ల టీడీపీ విజయం సాధించినట్లుగా ప్రిసైడింగ్ అధికారి మధుసూదన్ ప్రకటించారు.

మైదుకూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం

కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ పదవి వైసీపీ దక్కించుకుంది. చైర్మన్‌గా మాచనూరు చంద్ర, వైస్ ఛైర్మన్ గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. వారితో కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో వైపు కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ గెలుచుకుంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ నుంచి 12 మంది వైసీపీ నుంచి 11 మంది విజయం సాధించారు. ఒక స్థానాన్ని జనసేన గెలుచుకుకుంది. ఛైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి టీడీపీ నుంచి 11 మంది మాత్రమే హాజరయ్యారు. వైసీపీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, అదే పార్టీకి చెందిన మైదుకూరు శాసన సభ్యుడు రఘువీరా రెడ్డి ఎక్స్అఫిషియో సభ్యులుగా హాజరయ్యారు. వారి ఓట్లతో వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. జనసేన నుంచి గెలిచిన వార్డు సభ్యుడు తటస్థంగా నిలిచారు. ఏ పార్టీకీ ఆయన మద్దతు ప్రకటించలేదు.

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే ముగిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన పేర్లు.. తాడిపత్రి, మైదుకూరు. రాయలసీమలోని ఈ రెండు మున్సిపాలిటీలు హంగ్‌గా ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగినప్పటికీ.. ఈ రెండు చోట్ల టీడీపీని అడ్డుకోలేకపోయింది. ఆ పార్టీ కంటే తక్కువ సంఖ్యలో వార్డులను గెలుచుకోగలగడం కోసమెరుపు.

Tags:    

Similar News