తాడిపత్రి ఘటనపై స్పందించిన జేసీ దివాకర్ ‌రెడ్డి

* అనుచరులు, మద్దతుదారులు తరలిరావాలన్న జేసీ *నివురుగప్పిన నిప్పులా తాడిపత్రి పరిస్థితి * ప్రస్తుతం అమలులో 144సెక్షన్‌, 30 యాక్ట్‌

Update: 2021-01-03 04:32 GMT

దాడులు ప్రతి దాడులు అరెస్టులతో కొద్దిరోజుల కిందట తాడిపత్రి అట్టుడికి పోయింది. ఇంకా అక్కడ సాదారణ పరిస్థితి రావడానికి సమయం పట్టే అవకాశమూ ఉంది. అయితే ఇంతలోనే అట్రాసిటీ కేసును పరిష్కరించే వరకు ఆమరణ దీక్ష చేస్తానని జేసీ దివాకర్‌ రెడ్డి ప్రకటించారు. 144సెక్షన్‌ అమలులో ఉన్నా దీక్షా చేసే తీరుతాననడంతో తాడిపత్రిలో హై టెన్షన్‌ నెలకొంది.

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌ రెడ్డి ఏదిచేసినా సంచలనమే ఏంమాట్లాడిన సంచలనమే. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిక్కుల్లో పడ్డ ఆయన ఇప్పుడు పోరాటానికి సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీ కేసులను రాజకీయంగా వాడుకుంటూ తమలాంటి వాళ్లను అరెస్టు చేస్తున్నారని అందుకే ఇక తాడో పేడో తేల్చుకుంటాం అంటూ ఆమరణదీక్షకు సిద్ధమయ్యారు జేసీ దివాకర్‌ రెడ్డి. అయితే ఈనెల 4న తాడిపత్రిలో తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాను దీక్ష చేస్తు్న్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో తమను అరెస్ట్‌ చేసినా వెనక్కి తగ్గమన్నారు.

ఇక అనంతలో సంచలనం రేపిన తాడిపత్రి ఘటనపై కూడ జేసీ దివాకర్‌ రెడ్డి స్పందించారు. తన సోదరుడి ఇంటిపై ఎమ్మెల్యే దాడి ఘటనపై రియాక్ట్‌ అయిన జేసీ తమ ఇంటిపై దాడిచేసిన వాళ్లను వదిలి తమ వాళ్లపైనే కేసులు పెట్టారన్నారు. దీంతో ఈనెల 4న చేపట్టే ఆమరణదీక్షకు పెద్దఎత్తున తరలిరావాలంటూ అనుచరులు, మద్దతుదారులకు జేసీ పిలుపునిచ్చారు. కాగా తాడిపత్రిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతం 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమల్లో ఉంది. అటు కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నా దీక్ష మాత్రం చేసి తీరుతామంటున్నారు జేసీ.

మరోవైపు అమరావతి ఉద్యమంపై జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రజల ఆకాంక్ష బలమైనదైనా కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడిపెంచేలా ఉద్యమం సాగడం లేదని చెప్పుకొచ్చారు. అమరావతి విషయంలో సీఎంకి, పీఎంకి బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు ఆ‍యన. ఉద్యమం జరగబట్టి ఏడాదైనా ప్రభుత్వం స్పందించలేదు సరికదా కనీసం చర్చలు కూడా పిలవలేదన్నారు. అందుకే 70ఏళ్లపైబడిన వారంతా మాటలు కట్టిబెట్టి ఆమరణ దీక్ష చేయాలన్నారు. అవసరమైతే తాను కూడా ఇందులో ముందుంటానన్నారు జేసీ దివాకర్‌ రెడ్డి.

Tags:    

Similar News