రేపు విజయవాడలో జనసేన, బీజేపీ సమావేశం.. బీజేపీతో కలిసి పోరాడేందుకు జనసేన నిర్ణయం

ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి..రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.

Update: 2020-01-15 14:29 GMT

ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి..రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల కమలం పెద్దలతో భేటీ అయిన జనసేనాని బీజేపీతో కలిసి పోరాడేందుకు అవగాహనకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇదే నేపథ్యంలో గురువారం విజయవాడలో జనసేన, బీజేపీ నేతలు సమావేశం జరగబోతుండటంతో జనసేన కాషాయసేనగా మారబోతుందని భావిస్తున్నారు. ఢిల్లీ పెద్దల డైరక్షన్ లోనే బీజేపీ రాష్ర్ట నేతలు జనసేన నాయకులతో భేటీ కాబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి సాగాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టుగా అంచనా వేస్తున్నారు.

ఏపీలో మూడు రాజధానులపై స్పందించిన బీజేపీ.. ఒకే చోట రాజధాని ఉండాలని అంటుంది. మొదటి నుంచి బీజేపీ ఒకే మాటపై ఉందని.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టామని చెబుతున్నారు. అయితే జనసేనా కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తుంది. 2014లోనూ బీజేపీ, టీడీపీలతో కలిసి పని చేసిన జనసేన..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తప్ప ఇతర ఏ అంశాల్లోనూ బీజేపీతో ఇబ్బంది లేదని గతంలోనే ప్రకటించింది. బీజేపీ, జనసేన మధ్య ఎక్కడా పెద్దగా విభేదాలు రాలేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీని వదిలి కమ్యూనిస్టులతో జతకట్టిన జనసేన విఫలమైంది.

హస్తిన పర్యటనలో జనసేనాని ఎవరిని కలిశారు..ఏం జరిగిందన్న విషయాలు బయటకు రాకున్నా..రెండు పార్టీల మధ్య స్నేహబంధం ఏర్పడిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ, జనసేన సమావేశం కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. సమావేశం పొత్తుకే పరిమితం అవుతుందా..కాషాయంలో జనసేన విలీనమవుతుందా అన్నదానిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.  

Tags:    

Similar News