అలా వ్యవహరిస్తే జగన్‌రెడ్డి అనే పిలుస్తా : పవన్ కళ్యాణ్

Update: 2019-12-02 03:14 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జనసేన ఆత్మీయ యాత్ర పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి పవన్‌ కళ్యాణ్‌ తన యాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ కొంతమందికే సీఎంలాగా వ్యవహరిస్తున్నారు కాబట్టే జగన్ రెడ్డి అని పిలుస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపిస్తే వారు ప్రజలకు ఉపయోగపడటం లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో తప్పులు చేసిందని విమర్శించిన జగన్ ఆ తప్పులను ఇప్పుడెందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు.

చిన్న ఓరంపాడులో పచ్చదనాన్ని ఇచ్చే చెట్లును నరికారని, ఆ చెట్ల కన్నీటి శాపం.. నరికిన వారిని సమూలంగా నాశనం చేస్తుందంటూ శాపనార్దాలు పెట్టారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్‌ గడ్డ కాదన్న పవన్ రాయలసీమను చదువుల తల్లిగా మారుస్తానని సీమ స్థితిగతులను మార్చేందుకే ఇక్కడికి వచ్చానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతుల సమస్యపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని అన్నారు. పర్యటనలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. రేపు కడప, రాజంపేట పార్లమెంటరీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.

Tags:    

Similar News