సీఎం జగన్‌ నిర్ణయం ఆ కుటుంబానికి ఊరట : జనసేనాని

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన స్వాగతించింది.

Update: 2020-02-19 13:41 GMT
పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో

కర్నూలు జిల్లాకు చెందిన సుగాలీ ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన స్వాగతించింది. ముఖ్యమంత్రి జగన్‌ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుగాలీ ప్రీతి కుటుంబానికి ఒకింత ఊరట కలిగిస్తుందని జనసేన పేర్కొంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యమయిందని ఆవేదన వ్యక్తం చేసిన జనసేన..సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది.

సీబీఐ దర్యాప్తు ద్వారా త్వరగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పాఠశాలకు వెళ్లిన బాలికపై ఘాతుకానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఇటీవలే పవన్ కళ్యాణ్ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కర్నూలులో ఈ విషయమై ర్యాలీ నిర్వహిస్తే లక్ష మంది ప్రజలు మద్దతు పలికారని తెలిపారు. ప్రభుత్వంలో చలనం వచ్చేలా ప్రీతి కుటుంబానికి అండగా నిలిచిన జన సైనికులకు, ప్రజా సంఘాలకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ కేసును ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. సీఎం జగన్ స్పందించకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. సీబీఐకి అప్పగించాలని కోరారు. పవన్ ర్యాలీ తర్వాత వారం రోజులకు కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పవన్ ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు.



Tags:    

Similar News