ఏపీలో పొలిటికల్ తుఫాన్.. సీఎం జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు

AP News: తుఫాన్ పరామర్శ యాత్రలో పొలిటికల్ డైలాగ్స్

Update: 2023-12-09 09:46 GMT

ఏపీలో పొలిటికల్ తుఫాన్.. సీఎం జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు

AP News: మిచౌంగ్ తుఫాన్ ఏపీని కకావికలం చేసింది. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురు గాలులతో అల్లాడించింది. ముందస్తు జాగ్రత్త చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించామని వైసీపీ అంటుంటే.. తుఫాన్ టైంలో ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ విపక్షాలు నిందించాయి. తుఫాన్ వెళ్ళిపోగానే.. పొలిటికల్ తుఫాన్ స్టార్టైంది. ప్రజలను పరార్శించేందుకు, వారిలో భరోసా నింపేందుకు ఇటు సీఎం జగన్, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు జనంలోకి వచ్చారు. ఒకే రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు బయల్దేరారు. జగన్ తిరుపతి, బాపట్ల జిల్లాలో పర్యటించి.. రైతులు, తుఫాన్ బాధితులతో ముచ్చటించారు. చంద్రబాబు ఉన్న టైంలో తుఫాన్ వస్తే గాలికి వదిలేసేవారని, తమ ప్రభుత్వం అలా కాదు ప్రజల కోసమే ఉందని జగన్ చెప్పారు. గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ ఉందని దాంతో ప్రతీ ఇంటికీ నేరుగా వచ్చి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామని జగన్ చెప్పుకున్నారు.

మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఎవరో ఏదో చెబితే నమ్మవద్దన్నారు సీఎం జగన్. ఇన్‌‌పుట్ సబ్సిటీ సహా ఏ సాయం మీకు దక్కదు అని ఎవరు అన్నా పట్టించుకోవద్దన్నారు. మీకు సాయం అందకపోతే నేరుగా 1902 నంబర్ కే ఫోన్ చేయండి అది నేరుగా సీఎం ఆఫీస్ కే వస్తుంది అని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు రైతులకు చేసింది ఏమీ లేదని ఆయన హయాం అంతా కరవు కాటకాలే అని జగన్ దుయ్యబెట్టారు. తాము యుద్ధం చేస్తోంది కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని మారీచులతో కూడా అని జగన్ విమర్శించారు. ఏపీలో తమ ప్రభుత్వం ఎంతో మంచి చేస్తూంటే చూసి ఓర్వలేని వారు బురద జల్లుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు..ఈ ప్రభుత్వం చేయకపోతే మూడు నెలలు ఆగితే తామే అధికారంలోకి వచ్చి రైతులకు చేయాల్సింది అంతా చేస్తామన్నారు. ప్రకృతి విపత్తులు వస్తే మంత్రులు ఎక్కడ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి రైతులు అన్నా ప్రజలు అన్నా లెక్క లేదు అని బాబు నిప్పులు చెరిగారు. ఏపీలో పెద్ద ఎత్తున తుఫాన్ విరుచుకు పడితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం దారుణం అన్నారు. తాను తుఫాన్ బాధితులను పరామర్శిస్తానని తెలిసి అప్పుడు ముఖ్యమంత్రి బయల్దేరారని అంతే తప్ప ప్రేమ కాదని, పైగా తుఫాన్ ప్రభావం ఉన్న చోట కాకుండా వేరే చోట్ల ఆయన పర్యటనలు చేయడమేంటి అని చంద్రబాబు నిలదీశారు.

తుపాన్ పరామర్శ యాత్రలో..బాబు మీద జగన్, అలాగే జగన్ మీద బాబు విమర్శలతో రాజకీయ తుఫాన్ తెచ్చేశారని పొలిటికల్ వి‌శ‌్లేషకుల నుంచి వినిపిస్తున్న మాటలు. మరి జనాలు ఎలా రియాక్టు అవుతున్నారో ఈ రోజుకీ చేలలో నీళ్ళు నిలిచి ఉన్నాయి. నిరాశ్రయులుగా జనాలు ఉన్నారు. వారికి రాజకీయం కాదు కావాల్సింది సాయం. కానీ ఎన్నికల దగ్గర వచ్చిన మిచౌంగ్ తుఫాన్ తానూ పోతూ కూడా రాజకీయ సెగనే రాజేసి పోయింది అని అంటున్నారు.

Tags:    

Similar News