దేశంలోనే మొదటి సరోగసి దూడ.. శ్రీవారి గోశాలలో ఐవీఎఫ్ టెక్నాలజీతో 11 ఆవులకు గర్భదారణ
TTD: టీటీడీ, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ సంయుక్త ప్రయోగం
దేశంలోనే మొదటి సరోగసి దూడ.. శ్రీవారి గోశాలలో ఐవీఎఫ్ టెక్నాలజీతో 11 ఆవులకు గర్భదారణ
First Surrogate Calf: తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయం సంయుక్తాధ్వర్యంలో అద్భుతాలను ఆవిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరస్వామివారి నిత్యపూజల్లో అవసరమైన పాలు, నెయ్యి, పెరుగు పదార్థాలను దేశవాళీ ఆవులనుంచి ఉత్పత్తి చేయాలనే ఆలోచన ఇపుడు కార్యరూపం దాల్చబోతోంది. అప్పటి ఈవో జవహార్ రెడ్డి స్వతహాగా పశువైద్య నిపుణులు కావడంతో సాధ్యాసాధ్యాలపై కసరత్తుచేశారు. తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయ ఆవరణలో పరిశోధనా ఫలాలను సొంతంచేసుకుంటున్నారు.
ఐవీఎఫ్ టెక్నాలజీతో దేశవాళీ ఆవుదూడల ఉత్పత్తి చేయాలనే సంకల్పం నెరవేరింది. దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలో తొలిసారిగా సరోగసీ పద్ధతిన దేశవాళీ ఆవుదూడ జన్మించింది. తిరుపతి- చంద్రగిరి గిరి మార్గంలోని తుమ్మలగుంటకు సమీపంలో ఉన్న గో సంరక్షణ శాలలో, తొలి సరోగసి ఆవుదూడ జన్మించడంతో ప్రయోగం ఫలించిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంలో నిత్యం 60లీటర్ల స్వచ్ఛమైన ఆవు నెయ్యి అవసరం అవుతుంది. ఇప్పటి వరకు దీనికోసం టీటీడీ ప్రత్యేక టెండర్ల ద్వారా దేశవాళీ స్వచ్ఛమైన నెయ్యిని సేకరిస్తూ వస్తోంది. స్వామి వారి అభిషేకానికి, నిత్యపూజలకు అవసరమయ్యే వెన్న, నెయ్యిని స్వతహాగా తాయారు చేసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా సరిపడ ఆవులు సమకూర్చుకోవాలి. అయితే దీనికి దాదాపు 500 ఆవులు అవసరం అవుతాయి. అదికూడా రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలు ఇచ్చే దేశవాళీ ఆవులు అవసరం.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల కేంద్రంగా సాగుతున్న ఐవీఎఫ్ టెక్నాలజీ ఫలితంగా రాబోయే రోజుల్లో దేశవాళీ ఆవుదూడల సంతతి పెరగబోతోంది. లింగ నిర్ధారిత వీర్యంను గోశాలలో ఉన్న సాహివాల్, గిర్ గోవులలో కృత్రిమ గర్భధారణ ద్వారా ప్రవేశపెట్టి....కేవలం పెయ్య దూడలను మాత్రమే పొంది....తద్వారా సత్ఫలితాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దేశీవాలి ఆవులను పెంపొందించేందుకు ఆధునిక IVF టెక్నాలజీతో శ్రీవెంకటేశ్వర గోశాలలో ఆవుదూడలను పెంపొందించే ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే ఐదేళ్లలో 324 దేశవాళీ ఆవుదూడల ఉత్పత్తి లక్ష్యంగా ప్రయోగాలు సాగుతున్నాయి.