ఏపీలో హోటల్ గదులన్నీ ఫుల్.. కౌంటింగ్ రోజు నో-వేకెన్సీ ..
మందు..విందు.. అన్నీ అక్కడే..! రూంల బుకింగ్ లో ముందున్న బెట్టింగ్ రాయుళ్ళు
ఏపీలో హోటల్ గదులన్నీ ఫుల్.. కౌంటింగ్ రోజు నో-వేకెన్సీ..
హోటల్ లో రూము కావాలా ...మిగతా రోజుల్లో అయితే ఇస్తాం కానీ ఈ నెల నాలుగోతేదీ మాత్రం ఒక్కటంటే ఒక్క రూము కూడా ఇవ్వలేం..ఎందుకంటే రూములన్నీ ఎప్పుడో బుక్కయ్యాయి..ఏసీ, నాన్ ఏసీ, లగ్జరీ, చివరకు సూట్ లు కూడా ఖాళీ లేవు.. మీరెంత రిక్వస్ట్ చేసినా, రికమండేషన్ చేసినా రూము ఇవ్వలేం..ఇదీ, ఏపీలోని పట్టణాలు, నగరాల్లోని హోటల్ నిర్వాహకుల నుంచి వస్తున్న సమాధానం. జూన్ నాలుగంటే ఎన్నికల కౌంటింగ్ రోజు..రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు కాక పుట్టించే రోజు.. ఊపిరి బిగపట్టి ఉత్కంఠగా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న రోజు..ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని సాధారణ ఓటర్లే ఉక్కిరి బిక్కిరవుతుంటే ఇక ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల పరిస్థితి ఏమిటి..పోటీచేసిన అభ్యర్ధులు, వారి అనుచరుల పరిస్థితేమిటి..! అన్నిటికి మించి లక్ష నుంచి కోట్ల రూపాయలు దాకా బెట్టింగులు పెట్టిన వారి పరిస్థితి ఏమిటి..! ఇంకేముంది..! బీపీ మీటర్ బద్దలవ్వాల్సిందే.
అందుకే ఎన్నికల ఫలితాలు చూస్తూ ఫ్రెండ్స్ తో చిల్ అయ్యేందుకు హోటల్ రూములు బుక్ చేసుకున్నారు. గెలిస్తే సంబరాలు చేసుకోవానికి, ఓడితే ఓదార్చటానికి దోస్తానాలతో కలిసి హోటళ్లలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. కొన్ని చోట్ల రెండు ప్రధాన పార్టీల నుంచి బెట్టింగ్ కాసిన వారంతా ఒకే రూం బుక్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ మధ్యవర్తులను కూడా రూంలకు రప్పించేలా ఏర్పాట్లు చేశారు..ఎవరు గెలిస్తే వారికి హోటల్ రూంలోనే డబ్బులు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్లనే పెళ్ళిళ్ళ సీజన్ లో తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడు కావాలంటే అపుడు రూంలు దొరికే హోటళ్ళలో కూడా ఇపుడు ఖాళీలు లేవు. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి మహానగరాలతో పాటు అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, గుడివాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరుతో సహా ఎక్కడా రూంలు ఖాళీ లేవు.
ఏ సెంటర్, బీ సెంటర్, సీ సెంటర్ టౌన్లలోనూ హోటళ్ళలో రూంలు ఎప్పుడో బుక్కయ్యాయి. హోటళ్లలో ఖాళీలు లేక కొందరు గెస్ట్ హౌస్ లు బుక్ చేసుకున్నారు. మరికొందరు కళ్యాణమండపాలు, భారీ కన్వెన్షన్ సెంటర్ లలో ఉండే రూంలు బుక్ చేసుకున్నారు. హోటళ్ళలో రూంలు ఖాళీ లేకపోవటంతో తమ ప్రాంగణాల్లో ఉండే రూంలకు బాగా గిరాకీ పెరిగిందని గుంటూరుకు చెందిన ఒక కళ్యాణమండపం మేనేజర్ తెలిపారు. నెలరోజుల క్రితమే సాధారణ ఏసీ రూంలు, ఆ తరువాత లగ్జరీ రూంలు, సూటులు కూడా బుక్ అయ్యాయనీ..తమ వద్ద నాన్ ఏసీ రూంలు కూడా ఖాళీ లేవని మరో హోటల్ నిర్వాహకుడు తెలిపారు. అన్ని నగరాలు, పట్టణాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఈనెల 4వ తేదీ ఇతరులెవరైనా రూంలు బుక్ చేసుకుని ఏదైనా కారణాలతో క్యాన్సిల్ చేసుకుంటే హోటల్ నిర్వాహకులు వాటికి అధిక రేట్లు నిర్ణయిస్తున్నారు. భారీ రికమండేషన్ ఉన్న వాళ్ళకు కేటాయిస్తున్నారు.
హోటళ్ళపై పోలీసుల నిఘా
హోటల్ రూంలు బుక్ చేసుకున్న వారిపై పోలీసులు కూడా నిఘా ఉంచినట్టు సమాచారం. భారీగా ఎన్నికల పందాలు కాసిన నేపథ్యంలో హోటల్ రూముల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూసుకోవాలనీ, రౌడీషీటర్లకూ, ఇతర అసాంఘిక శక్తులకు రూంలు ఇవ్వవద్దని హోటల్ నిర్వాహకులకు పోలీసులు చెబుతున్నారు.
144 సెక్షన్ అమలు
కౌంటింగ్ రోజు రాష్ట్రమంతా 144 సెక్షన్ అమలవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గుమికూడదు. హోటళ్ళు బుక్ చేసుకోవటానికి ఇది కూడా ఒక కారణం. ఎన్నికల హింసకు కేరాఫ్ గా నిలిచిన అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన పల్నాడులో అయితే ఈనెల 2 నుంచే వ్యాపార సంస్థల మూసివేయిస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధాలున్న వారెవరినీ హోటళ్లలో కూడా ఉండనీయటం లేదు. అందువల్లనే ఇతరుల పేర్లతో హోటళ్ళు బుక్ చేసుకుంటున్నారు. దానిపై కూడా పోలీసుల నిఘా ఉంది
మందు .. విందు.. ప్రత్యేక వంటకాలకు ఆర్డర్
కౌంటింగ్ కు ముందు రోజు, కౌంటింగ్ రోజు.. అంటే ఈ నెల 3,4 తేదీల్లో మద్యం విక్రయాలపై నిషేధం ఉంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లలో మద్యం అలవాటున్న వారు ముందుగానే స్టాకు సిద్ధం చేసుకున్నారు. ఎటు తిరిగీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చవకబారు సరుకు కావటంతో ఇతరు ప్రాంతాల నుంచి తమకిష్టమైన మందు బాటిళ్లను తెచ్చుకుని సిద్ధం చేసుకున్నారు. అంతే కాదండోయ్.. కౌంటింగ్ రోజు నరాల తెగే ఉత్కంఠతో టీవీ చూస్తూ తినటానికి మంచి విందు భోజనం రెడీ చేసుకుంటున్నారు.. ఈ మేరకు హోటళ్ళకు ముందుగానే ఆర్డర్లిచ్చారు. . కౌంటింగ్ రోజు శాంతిభద్రతల రీత్యా ప్రతి పట్టణంలో ఒకటి రెండు హోటళ్ళు తప్ప మిగతా దుకాణాలన్నిటినీ పోలీసులు బంద్ చేయిస్తున్నారు. అందువల్ల ముందుగానే ఆర్డర్లిచ్చిన వారికి వాటిని ఆయా హోటళ్ళకు చేర్చేందుకు హోటళ్ళు ఏర్పాటు చేస్తున్నాయి.