Nallamala Forest: నల్లమలపై అటవీ శాఖ డేగకన్ను
అటవీశాఖ అధికారుల డేగకన్నులో నల్లమల 3 డివిజన్లలో అధికారుల బృందం పర్యటన పులుల కదలికలు, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా
Nallamala Forest: నల్లమలపై అటవీ శాఖ డేగకన్ను
నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడు అటవీ శాఖ అధికారుల డేగ కన్నులో ఉంది. ఆసియాలోనే అతిపెద్ద పులుల అభయారణ్యమైన నాగార్జునసాగర్ - శ్రీశైలం పరిధిలో వన్యప్రాణుల రక్షణ కోసం ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
అడవుల పరిరక్షణకు అధికారులు కొత్త ఆలోచనతో ముందుకువచ్చారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కేంద్రంగా ఉన్నతాధికారుల బృందం విస్తృత పర్యటన చేపట్టింది. అటవీ రక్షణపై కీలక ఆదేశాలు జారీ చేసింది. PCCF అధికారులు రాహుల్ పాండ్య, శాంతి ప్రియ పాండ్యలతో కలిసి NSTR ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆత్మకూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం డివిజన్లలో పర్యటించారు. అడవిలో పులుల కదలికలు, రక్షణ చర్యలు, సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షించారు.
నాగలూటి అటవీ ప్రాంతంలో పెద్దపులుల కోసం వేటగాళ్లు వేసే ఉచ్చులను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వేటగాళ్లపై NSTR ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. 3500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. అడవిలోకి వచ్చే అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారి ఆధార్ కార్డుల ఆధారంగా విచారణ చేపడుతూ వేటగాళ్ల నెట్‌వర్క్ ఛేదిస్తున్నారు. నాలుగు డివిజన్ల పరిధిలో అటవీ సిబ్బంది రేయింబవళ్లు అడవుల్లోనే ఉంటూ గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఆత్మకూరు - గుండ్ల బ్రహ్మేశ్వరం అటవీ ప్రాంతాల్లో గతంలో ఉండి, ఇప్పుడు కనుమరుగైన అడవి దున్నలను తిరిగి ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు అనువైన గడ్డి మైదానాలు, నీటి వసతి ఉన్న ప్రదేశాలను ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించారు. వన్యప్రాణుల ఆవాసాలను మెరుగుపరచడం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడాలని నిర్ణయించారు.ఎండాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో అడవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ లైన్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే వన్యప్రాణులకు తాగునీటి ఎద్దడి లేకుండా సాసర్ పిట్లు నింపడం, గడ్డి మైదానాల అభివృద్ధిపై డిప్యూటీ డైరెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
వన్యప్రాణులే నల్లమలకు ప్రాణం.. వాటిని వేటాడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు. అటవీ శాఖ తీసుకుంటున్న కఠిన చర్యలు వన్యప్రాణి ప్రేమికుల్లో హర్షాన్ని నింపుతున్నాయి.