సీఎం సొంత జిల్లా కడపలో కొత్త సీన్.. వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు సిట్టింగ్‌లకు సీటు కష్టమేనా ?

Andhra News: సీఎం సొంత జిల్లా కడపలో కొత్త సీన్.. వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు సిట్టింగ్‌లకు సీటు కష్టమేనా ?

Update: 2023-12-25 05:55 GMT

సీఎం సొంత జిల్లా కడపలో కొత్త సీన్.. వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు సిట్టింగ్‌లకు సీటు కష్టమేనా ?

Andhra News: సీఎం సొంత జిల్లాలో సీన్ మారిందా ? ముగ్గురు సిట్టింగ్ లకు ఫిట్టింగ్ తప్పదా ? వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు సిట్టింగ్ లకు సీటు కష్టమేనా ? టికెట్ల కేటాయింపులో నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ సొంత జిల్లా నేతలకు ఉద్వాసన చెప్పేశారా ? ఒకరిపై అవినీతి ఆరోపణలు.. మరొకరిది వయోభారం కాగా మరో ఎమ్మెల్యేను చుట్టుముట్టిన వివాదాలతో సీటుకు ఎసరు తెచ్చుకున్నారా ? ఇంతకీ ఏంటా జిల్లా ? ఎవరా ముగ్గురు ?

వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ అధికార వైసీపీ అడుగులు వేస్తోంది. గెలుపే లక్ష్యంగా మార్పులు, చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ కేటాయింపుల కసరత్తు ప్రారంభించారు సీఎం జగన్. ఇక సొంత జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారట. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 స్థానాలు సాధించిన వైసీపీ మరోసారి క్లీన్ స్వీప్ చేయాలని సీఎం ప్రణాళికలు సిద్ధం చేశారట. సర్వేల నివేదికలు, నియోజకవర్గంలో వ్యవహార శైలి, అవినీతి ఆరోపణల పై నివేదిక సిద్దం చేసి వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమని తెగేసి చెప్పారట. దీంతో జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు సిట్టింగ్ లకు సీటు కష్టమని చెప్పినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో గెలిచిన మూలె సుధీర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని తేలడంతో అక్కడ అభ్యర్థి మార్పు తప్పదని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా గండికోట ముంపు బాధితులకు న్యాయం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున దేవుడి భూపేష్ రెడ్డి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా పర్యటిస్తున్నారట. జమ్మలమడుగులో రాజకీయంగా దేవగుడి కుటుంబాన్ని ఢీ కొట్టాలంటే సుధీర్ రెడ్డిని తప్పించి వైఎస్ కుటుంబం నుంచి ఎవరో ఒకరిని రంగంలోకి దింపాలని సీఎం జగన్ భావిస్తున్నారట. దీంతో అభ్యర్థి మార్పుపై ఇప్పటికే జగన్ సంకేతం ఇచ్చినట్లు అక్కడి వైసీపీ క్యాడర్‌లో కూడా చర్చించుకుంటున్నారట.

ఉమ్మడి కడప జిల్లాలో మరో కీలక నియోజకవర్గం ప్రొద్దుటూరు. 2014,2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి రెండు సార్లు వరుసగా గెలిచినా మూడోసారి మాత్రం ఓటమి తప్పదంటున్నారు. జిల్లాలో రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చుట్టూ నిత్యం వివాదాలు ఉంటాయట. టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో శత్రుత్వం వంటి వాటిపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శించిన సందర్భాలు అనేకమట. మరోవైపు బామ్మర్ది బంగారు రెడ్డి వ్యవహార శైలి రాచమల్లుకు తలనొప్పిగా మారిందట. దీంతో ప్రొద్దుటూరులో మెజారిటీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇటీవల సమావేశం కావడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిందట. అంతేకాదు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా రాచమల్లు శివప్రసాద్‌తో శంఖుస్థాపనలు తప్ప అభివృద్ధి జరగలేదనే ఆరోపణలు ఉన్నాయట. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు తప్పదని టాక్ నడుస్తోందట. అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా ఉన్న రమేష్ యాదవ్ ఎమ్మెల్యే బరిలో ఉంటానని ఇప్పటికే సమాచారం ఇచ్చారట.

సీఎం సొంత జిల్లాలోని మరో నియోజకవర్గం మైదుకూరు రాజకీయం మరింత రంజుగా మారిందట. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన రఘురాం రెడ్డిపై అవినీతి ఆరోపణలు లేకపోయినా వయసు రీత్యా వచ్చే ఎన్నికల్లో తప్పించాలని జగన్ భావిస్తున్నారట. టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కు వచ్చే ఎన్నికల్లో సానుభూతి తప్పదని తేలడంతో వైసీపీ నుంచి బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను రంగంలోకి దించాలని జగన్ బావిస్తున్నారట. రఘురాం రెడ్డి మాత్రం తనకు కాకపోతే తన కుమారుడు నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఇలా మొత్తానికి సీఎం సొంత జిల్లా కడపలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ తప్పదనే టాక్ జోరుగా సాగుతుండగా... మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News