Andhrapradesh: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకానికి రూపకల్పన చేశారని వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు అన్నారు.

Update: 2020-01-10 12:29 GMT

గుడివాడ: పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకానికి రూపకల్పన చేశారని వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు అన్నారు. శుక్రవారం స్థానిక 11వ వార్డు జండా చెట్టు దగ్గర అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండలి మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు. పిల్లలను చదివించే తల్లుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా ఒకే విడతగా రూ.15,000 జమ చేయడం అభినందనీయమన్నారు.

పట్టణంలోని 11వ వార్డులో ఎక్కువగా మైనార్టీలు నివసిస్తున్నారని, వీరంతా చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తుంటారన్నారు. వీరి పిల్లలు కూడా విద్యకు దూరమవుతూ చేతివృత్తులకు పరిమితమవుతున్నారన్నారు. అమ్మ ఒడి పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు గడువు ఉందని, ఏవైనా సమస్యలు ఉంటే ఎంఈఓ కార్యాలయంలో గానీ, వైసీపీ కార్యాలయంలో గానీ సంప్రదించాలన్నారు. మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రతిపక్షాలు జగన్ ను విమర్శించకుండా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు ఇవ్వాలని సూచించారు. వచ్చే ఐదేళ్లలో జగన్ పేదల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తారని అన్నారు.

మున్సిపల్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్ మాట్లాడుతూ.. అమ్మఒడి అమలు కాదని విమర్శలు చేశారని, జగన్ అమలు చేసి చూపించారని అన్నారు. వైసీపీ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న జగన్ ను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు. ముందుగా జండాలకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు షేక్ గౌస్, మల్లిపూడి శ్రీనివాస్ చక్రవర్తి, నాయకులు అల్లం రామ్మోహన్, కరిముల్లా బేగ్, రజాక్ భాషా, షమ్ము, నాగులా తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News