ఎట్టకేలకు మౌనం వీడిన వైసీపీ నేత..

Update: 2019-02-27 12:57 GMT

ప్రకాశం జిల్లా వైసీపీలో నెలకొన్న వివాదాలు ఒక్కొక్కటిగా సద్దుమణుగుతున్నాయి. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు కుమారుడు హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరిక సందర్బంగా ఆ పార్టీకి ఓ వివాదం పరిష్కారం అయింది. పర్చూరులో గత ఎన్నికల్లో పోటీ చేసిన గొట్టిపాటి భరత్.. దగ్గుబాటి చేరికను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈసారి తనకు కాకుండా రావి రామనాధంబాబుకు టికెట్ ఇవ్వాలని భరత్ అధిష్టానాన్ని కోరారు. దీంతో పాదయాత్ర సమయంలో రామనాధంబాబును పర్చూరుకు ఇంఛార్జిగా ప్రకటించారు జగన్. దాంతో టికెట్ తాను సూచించిన నేతకే వస్తుందని భరత్ కూడా ఆశించాడు. అయితే సడన్ గా దగ్గుబాటి కుటుంబం జగన్ ను కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించింది. ఆ సమయంలో పర్చూరు టికెట్ వెంకటేశ్వరావు కుమారుడు చెంచురామ్ కు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.

దాంతో భరత్ వర్గం షాక్ అయింది. ఈ విషయంలో ఒకటి రెండుసార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలని భరత్ వర్గం అధిష్టానాన్ని కోరింది. అయితే అధిష్టానం భరత్ సూచనను పట్టించుకోలేదు. ఇదిలావుండగా భరత్ వర్గం కార్యకర్తలతో సమావేశమైంది. ఒకానొకదశలో భరత్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని భావించారు. ఈ క్రమంలో హితేష్ చెంచురామ్ ఇవాళ(బుధవారం) వైసీపీలో చేరిపోయారు. అనూహ్యంగా ఈ కార్యక్రమానికి భరత్ కూడా రావడం, చెంచురామ్ చేరికను స్వాగతించడం జరిగింది. దీంతో భరత్ అలక పాన్పు దిగినట్టే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి.

Similar News